సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
నల్లగొండ, ఏప్రిల్ 8 : రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టులో నిర్వహించనున్న 8వ విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఆదేశించారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో శుక్రవారం హరితహారంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన హరితహారంలో భాగంగా ఏడు విడుతల్లో కోట్లాది మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగి పర్యావరణ పరిరక్షణకు బీజం పడిందని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి నిర్వహించే హరితహారంలో పెద్ద ఎత్తున ప్రజలను అవగాహన పరిచి పాల్గొనేలా చేయాలని సూచించారు. జూలై మొదటి వారంలోనే గ్రామ స్థాయిలో అమలు చేయాల్సిన ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై పెరిగిన మొక్కలతో పచ్చదనం అలరారుతున్నదని అన్నారు. రెండేండ్లుగా బ్లాక్ ప్లాంటేషన్, జాతీయ, రాష్ట్ర రహదారులపై అవెన్యూ ప్లాంటేషన్ చేయడం మంచి ఫలితాలిచ్చిందని తెలిపారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, చనిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు.
అంతకు ముందు ఆమె కలెక్టరేట్లో మొక్కను నాటారు. సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఎఫ్ఓ రాంబాబు, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఆర్డీఓ కాళిందిని పాల్గొన్నారు.
ప్రకృతి వనాల పరిశీలన
నీలగిరి : నల్లగొండ పట్టణంలోని రాంనగర్ పార్కు, ఎస్‌ఎల్‌బీసీలోని బృహత్ పట్టణ ప్రకృతి వనం అభివృద్ధి పనులను సీఎం కార్యాలయ ఓఎస్డీ, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌తో కలిసి పరిశీలించారు. నీటి వసతి, మొక్కల సంరక్షణ, ఎరువుల వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ఇంజినీర్లు వెంకన్న, వినోద్ పాల్గొన్నారు.