అర్వపల్లి, ఏప్రిల్ 6 : అతి పురాతన ఆలయమైన అర్వపల్లి యోగానంద లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న ధ్వజస్తంభం, మహా రాజగోపురం పనులకు ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆలయ పునర్నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ నిధుల నుంచి రూ.1.20 కోట్లు మంజూరు చేయగా.. గర్భాలయం, ఉప ఆలయాల నిర్మాణాలు పూర్తికావచ్చాయి. కాగా, మంత్రి జగదీశ్‌రెడ్డి సొంత డబ్బులు రూ.1.30 కోట్లతో మహా రాజగోపురం, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సొంత నిధులు రూ.20 లక్షలతో ధ్వజస్తంభం నిర్మాణానికి పూనుకున్నారు.
పనుల ప్రారంభానికి ముందు ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు, హోమం చేశారు. స్వామివారి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. అర్వపల్లి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు. పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. మే 21 నుంచి ఆలయంలో ధ్వజస్తంభం, రాజగోపురం ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు మంత్రి జగదీశ్‌రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.