నల్లగొండ, సూర్యాపేట, మార్చి 17: రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నది. నిప్పుల కొలిమిలా మారిన వాతావరణంతో జనం విలవిలలాడుతున్నారు. ఐదేళ్లతో పోలిస్తే ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. సాధారణంగా మార్చిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతాయి. కానీ.. ఈసారి 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో సూర్యప్రతాపం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
తగ్గిన జనసంచారం…
వేడిగాలులు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి. మధ్యాహ్న వేళలో జన సంచారం తగ్గిపోయి రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉపాధిహామీ పనులకు వెళ్లే కూలీలు, రోడ్డు పక్కన చిరు వ్యాపారులతోపాటు వివిధ పనుల కోసం బయటకు వెళ్లిన వారు అవస్థలు పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు సైతం ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. ఎండల తీవ్రత నేపథ్యంలో.. అత్యవసరమైతేనే ప్రజలకు బయటకు వెళ్తున్నారు. గత రెండేళ్లుగా వేసవిలో లాక్డౌన్ కారణంగా చాలామంది ఇండ్లకే పరిమితమై ఎండ ప్రభావం నుంచి కాపాడుకోగలిగారు. గతేడాది వర్షాలు బాగా కురవడంతో చెరువులు, కుంటల్లో మండు వేసవిలోనూ నీరు పుష్కలంగా ఉంది. దీంతో ఈసారి ఎండలు తక్కువగా ఉండవచ్చని అందరూ భావించారు. కానీ, అందుకు భిన్నంగా సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బ తగులకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కూలర్లు, ఫ్రిజ్‌లకు గిరాకీ…
ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది కూలర్లు, ఫ్రిజ్‌లను కొనుగోలు చేస్తుండడంతో వాటికి గిరాకీ పెరిగింది. ఆర్థిక పరిస్థితిని బట్టి కొందరు ఎయిర్ కూలర్లు, ఏసీలను కొనుగోలు చేస్తే.. మరికొందరు ఫ్యాన్లు, కూలర్లు, మట్టి కుండలను కొనుగోలు చేస్తున్నారు. కొందరు మూలన పడేసిన కూలర్లు తీసి మరమ్మతు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వీసింగ్ సెంటర్లకు సైతం జనం తాకిడి పెరిగింది. ప్రస్తుతం ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రతి ఇంట్లో కూలర్లు, ఫ్రిజ్‌లు, మట్టికుండలు నిత్యావసర సరుకుల సరసన చేరిపోతున్నాయి. శీతల పానీయాలకు, జ్యూస్ సెంటర్లకు సైతం గిరాకీ పెరగగా.. కొబ్బరి బొండాలు, పుచ్చకాయల అమ్మకాలు సైతం గణనీయంగా పెరిగాయి.