నల్లగొండ, మార్చి 17: కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గురుకుల విద్యాలయాలు కార్పొరేట్‌కు దీటుగా కొనసాగుతున్నాయి. మొదటగా మోడల్ స్కూల్స్ ప్రారంభించిన ప్రభుత్వం.. ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యతో పాటు వసతి కల్పించాలనే లక్ష్యంతో గురుకులాలకు శ్రీకారం చుట్టింది. 2016-17 విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి ఐదో నుంచి ఏడో తరగతి వరకు అడ్మిషన్లు కల్పించింది. ఆ తర్వాత ఏటా ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తూ తరగతులను అప్‌గ్రేడ్ చేస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ, గిరిజన.. మొత్తం 84 విద్యాలయాలను స్థాపించింది. ప్రస్తుతం 64 విద్యాలయాలను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేసింది. పాఠశాల స్థాయిలో 40,320 మంది.. కళాశాల స్థాయిలో 9,440 మంది చొప్పున మొత్తం 49,760 మంది విద్యార్థులు గురుకులాల్లో చదువుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మూడు సోషల్ వెల్ఫేర్, రెండు ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలు ఉండగా 2016లో మంజూరైన గురుకులాల్లోనూ డిగ్రీ తరగతులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
కార్పొరేట్ స్థాయిలో 50వేల మందికి ఉచిత విద్య…
పేద వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో బీసీ, ఎస్సీ, గిరిజన, మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. అప్‌గ్రేడ్ చేసిన కళాశాల్లో ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యతో పాటు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నది. మొత్తం 84 విద్యాలయాలకు గాను 64 ఇంటర్మీడియట్‌కు అప్‌గ్రేడ్ అయ్యాయి. ఆయా కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, ఒకేషనల్ కోర్సులు అందిస్తున్నది.
వచ్చే ఏడాది గ్రాడ్యుయేషన్ అప్ గ్రేడ్ చేసేలా ప్రణాళికలు..
2016లో ఐదో తరగతి నుంచి ప్రారంభమైన పాఠశాలల్లో నేడు ఇంటర్మీడియట్ తరగతులు కొనసాగుతున్నాయి. ఆయా కళాశాలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి వచ్చే ఏడాది నుంచి డిగ్రీలోనూ ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మండలాల వారీగా పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయగా డిగ్రీ కళాశాలలు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయనున్నది. బాల, బాలికలకు వేర్వేరుగా కళాశాలల్లో ప్రవేశం కల్పించనున్నారు.
కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు…
రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించింది. విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, స్టేషనరీ, యూనిఫాం, షూ, కాస్మొటిక్స్ కోసం విద్యార్థులకు ప్రతి నెలా రూ.140అందిస్తున్నది. మెనూలో భాగంగా ఉదయం జావ, తర్వాత అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, పౌష్టికాహారానికి ప్రాధాన్యమిస్తూ గుడ్లు, మటన్, చికెన్ అందిస్తున్నది. వార్షిక ఫలితాల్లోనూ గురుకుల విద్యార్థులు సత్తా చాటుతున్న నేపథ్యంలో ప్రవేశాల్లో తీవ్ర పోటీ నెలకొంది.
గురుకులాల్లో నాణ్యమైన విద్య, వసతి..
సమైక్య పాలనలో ఎంతో మంది దళిత, గిరిజన, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆర్థిక భారంతో చదువుకు దూరమయ్యారు. ఉద్యమ నాయకుడుగా పలు సమస్యల మూలాలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో 2016లో ప్రారంభించిన గురుకులాలు కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయి. విద్యతో పాటు చక్కని వసతి, పౌష్టికాహారం, యూనిఫాం, పుస్తకాలు విద్యార్థులకు అందుతున్నాయి. దాంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువులో రాణిస్తున్నారు.
– నారబోయిన స్వరూపారాణి, జడ్పీ సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం చైర్పర్సన్
ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్..
నల్లగొండ జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్డులోని రాఘవేంద్ర బీఈడీ కళాశాల భవనంలో మునుగోడు, చందుపట్ల బ్రాంచ్‌లకు సంబంధించి ఇంటర్మీడియట్ తరగతులు కొనసాగుతున్నాయి. మొత్తం 430 మంది విద్యార్థినులు ఉన్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫ్యాకల్టీ ఉన్నారు. తరగతులతో పాటు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ ఉంటాయి. ఆసక్తి ఉన్న విద్యార్థినులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నాం.
– రాజారాం, ప్రిన్సిపాల్, చందుపట్ల, మునుగోడు బ్రాంచీలు
ఐదో తరగతి నుంచి గురుకులంలోనే చదువుకుంటున్నా..
మాది హాలియా. మా నాన్న కార్ డ్రైవర్‌గా పని చేస్తాడు. 2016లో ఏడో తరగతిలో ఎంట్రన్స్ పరీక్ష రాస్తే నిడమనూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది. ఉపాధ్యాయులు బాగా బోధించడంతో పదో తరగతిలో 10జీపీఏ వచ్చింది. మళ్లీ ఎంట్రన్స్ రాసి చందుపట్ల బ్రాంచ్‌లో చేరి ఎంపీసీలో చేరాను. ఖర్చు లేదు కాబట్టి మా అమ్మానాన్న ఎంత వరకైనా చదివిస్తామని చెప్తున్నారు.
– వడ్త్యా సరిత, ఇంటర్మీడియట్ విద్యార్థిని, చందుపట్ల
ఉచితంగా ఇంత మంచి చదువు దొరుకుతుందనుకోలేదు..
మాది తిరుమలగిరి సాగర్ మండలం జానారెడ్డి కాలనీ. చౌటుప్పల్ గురుకుల పాఠశాలలో ఏడు నుంచి పదో తరగతి వరకు చదివాను. ప్రస్తుతం మునుగోడు బ్రాంచ్‌లో ఇంటర్మీడియట్లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నా. గురుకుల పాఠశాలలో చదువు, బోధన చాలా బాగుంది. పదో తరగతిలో 10జీపీఏ వచ్చింది. ఇంటర్మీడియట్లో కూడా బాగా చెప్తున్నారు. మాలాంటి పేదలకు ఫ్రీగా ఇంత మంచి చదువు లభించడం సంతోషంగా ఉంది.
– జటావత్ దివ్య, ఇంటర్మీడియట్ విద్యార్థిని, మునుగోడు
ఇంట్లో కూడా ఇంత మంచి భోజనం ఉండదు…
మాది నల్లగొండ మండలం అప్పాజిపేట. మా అమ్మా నాన్న వ్యవసాయం చేస్తారు. నేను చందుపట్ల గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివి ఇంటర్మీడియట్లో కూడా ఇదే కళాశాలలో సీటు తెచ్చుకున్నా. ప్రస్తుతం బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఉదయం ఏడు గంటలకు జావ, తొమ్మిది గంటలకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం రెండు మూడు కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ ఉంటుంది. వారానికి రెండు సార్లు మటన్, చికెన్ పెడతారు. ఇంత మంచి భోజనం మన ఇంట్లో కూడా ఉండదు.
– మైల భవాని, ఇంటర్మీడియట్ విద్యార్థిని, చందుపట్ల