నల్లగొండ ప్రతినిధి, మార్చి 17(నమస్తే తెలంగా ణ) : నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడ పరిధిలో పోలీసు బెటాలియన్‌కు ఎదురుగా ఉన్న రాజీవ్ స్వగృహ ప్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించింది. ప్రభుత్వమే అన్ని వసతులను కల్సిస్తూ డీటీసీపీ నిబంధనల ప్రకారం వెంచర్ అభివృద్ధి చేయాలని ఆదేశాలిచ్చింది. దీని ప్రకారం నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నేతృత్వంలో అధికారులు దీన్ని అభివృద్ధ్ది బాధ్యతను తీసుకున్నారు. రాజీవ్ స్వగృహ పాట్ల సముదాయానికి శ్రీవల్లి టౌన్‌షిప్‌గా నామకరణం చేస్తూ ఓపెన్ యాక్షన్‌కు సిద్ధం చేశారు. మొత్తం వెంచర్‌ను శుభ్రం చేస్తూ లేవుట్‌ను రూపొందించారు. దీని ప్రకారం ఓపెన్ ఆక్షన్ ప్రకటించారు. రూ. 10 వేల ధరవాత్తో డీడీ చెల్లించడం ద్వారా వేలంలో పాల్గొనవచ్చని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు.
ఈ నెల 14 నుంచి ప్రతీ రోజూ 60 ప్లాట్ల చొప్పున కలెక్టరేట్లో వేలం నిర్వహించారు. వరుసగా నాలుగు రోజుల పాటు జరిగిన వేలంలో మొత్తం 240 ప్లాట్లకు 165 ప్లాట్లు వేలంలో అమ్ముడయ్యాయి. చదరపు గజానికి కనీస ధరగా రూ.7వేలు నిర్ణయించి 100 రూ.ల చొప్పున పెంచుతూ వేలం నిర్వహించారు. ఇలా తొలిరోజు నిర్వహించిన వేలంలో మల్టీపర్పస్, కమర్షియల్ ప్లాట్లకు మంచి ధర లభించింది. గరిష్ఠంగా చదరపు గజానికి రూ.13,500 పలికింది. తొలి రోజూ మొత్తం 45 ప్లాట్లు వేలంలో అమ్ముడుపోయాయి. రెండో రోజు నిర్వహించిన ప్లాట్లలో 28 ప్లాట్లు వేలంలో అమ్ముడయ్యాయి. గరిష్టంగా రెసిడెన్షియల్ విభాగంలో చదరపు గజానికి రూ.8700 ధర పలకడం విశేషం. మూడు రోజు వేలంలో మొత్తం 34 ప్లాట్లను ఓపెన్ యాక్షన్‌లో బిడ్డర్లు సొంత చేసు కున్నారు. గరిష్ట ధరగా అనూహ్యంగా చదరపు గజానికి రూ.10,500 పలికింది. ఇక చివరి రోజూ మిగిలిన 62 ప్లాట్లను యాక్షన్ వేయగా అందులో 41 ప్లాట్లు అమ్ముడు పోయాయి. ఇక వీటితో పాటు చివరి రోజు గురువారం అంతకుముందు మూడు రోజుల్లో మిగిలిపోయిన 71 ప్లాట్లకు కూడా వేలం నిర్వహించగా అందులో 17 ప్లాట్లకు బిడ్డర్లు ముందుకు వచ్చి కొనుగోలు చేశారు.
మొత్తం రూ. 31.79 కోట్ల ఆదాయం
నాలుగు రోజులు నిర్వహించిన వేలంలో 240 ప్లాట్లకు 165 ప్లాట్లు అమ్ముడుపోగా తద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ. 31,79,38,800 ఆదాయం సమకూరనున్నట్లు అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ వెల్లడించారు. అయితే ప్లాట్లను సొంతం చేసుకున్న వారు వారం రోజుల్లో 33 శాతం, తర్వాత 45 రోజుల్లో మరో 33శాతం, 90 రోజుల్లోపు మొత్తం డబ్బులు చెల్లిస్తే ప్లాట్లను రిజి స్ట్రేషన్ చేయనున్నారు. అయితే మొత్తం డబ్బును నెల రోజుల్లోపే చెల్లిస్తే రెండు శాతం రాయితీని కూడా ఆఫర్‌గా ప్రకటించారు. అయితే డీటీసీపీ నిబంధనల మేరకు వెంచర్‌ను ప్రభుత్వమే సకల వసతులతో అభివృద్ధ్ది చేయనుంది. విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి పాటు అన్ని రకాల వసతులను కల్పించి డిసెంబర్ 22వ తేదీ నాటికి వెంచర్‌ను అప్పగించనుంది.
మిగిలిన ప్లాట్లపై త్వరలో నిర్ణయం
మొత్తం 240 ప్లాట్లలో మరో 75 ప్లాట్లు యా క్షన్లో బిడ్డర్లు ముందుకు రాక మిగిలిపో యాయి. అయితే ఇలా మిగిలిపోయిన ప్లాట్ల వివరాలను జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించ నున్నారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ వెల్లడించారు. తాము ఊహించిన దాని కంటే శ్రీవల్లి టౌన్షిప్ వేలానికి మంచి స్పందన వచ్చిందని ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ చెప్పారు. చివరి రోజు కార్యక్ర మంలో హెచ్ఎండీఏ ఈఈ రమేష్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, జిల్లా ఫౌరసఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్రావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలశౌరి పాల్గొన్నారు.