నల్లగొండ, మార్చి 17: ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువా రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన బ్యాంకర్లతో డీసీసీ డీఎల్ఆర్సీ-3వ త్రైమాసిక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంట రుణాలు, విద్యారుణాలు, ఎస్‌హెచ్‌జీ రుణాలపై మాట్లాడారు. వ్యవసాయ రంగానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో వానకాలంలో రూ. 2,308 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా డిసెంబర్-21 నాటికి రూ.1832 కోట్లు అందించి 79.38శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు బ్యాంకర్లు వివరించారు. యాసంగి సీజన్‌కు సంబంధించి రూ.1540 కోట్ల లక్ష్యానికి గాను రూ.657 కోట్లు అందించినట్లు తెలిపారు. జిల్లా వార్షిక ప్రణాళిక కింద వివిధ రంగాలకు రూ. 7,303 కోట్లకుగాను రూ. 4,569 కోట్లు అందజేశామని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తమ రుణాలను రెన్యువల్ చేసుకునేలా బ్యాంకర్లు అవగాహన కల్పించాలని, అన్ని బ్యాంకులు రుణ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. మహిళలు స్వశక్తితో ఆర్థిక ప్రగతి సాధించేందుకు ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి, దళిత బంధు పథకాలకుగాను లబ్ధిదారులు ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్లు సహకరించా లని సూచించారు. సమావేశంలో ఎల్డీఎం సూ ర్యం, డీఆర్డీఏ పీడీ కాళిందిని తదితరులున్నారు.