తైబజార్ పన్ను వసూళ్లపై పునరాలోచించాలి
బకాయిలు, పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
మరో ఐదారు నెలల్లో పట్టణంలో గుణాత్మక మార్పు : కలెక్టర్
నీలగిరి, ఫిబ్రవరి 26 : నల్లగొండ మున్సిపాలిటీకి సబంధించి 2022-23 వార్షిక బడ్జెట్ రూ.342.53 కోట్లకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. శనివారం జరిగిన సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మందడి సైదిరెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. వీధివ్యాపారుల నుంచి త్రైబజార్ పేరుతో పన్ను విధించడం సరికాదని, ఈ విషయంలో పునరాలోచించాలని సభ్యులు సూచించారు. స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఆస్తి పన్ను, నల్లా బిల్లులు, ఇతర మున్సిపాలిటీ ఆదాయంపై నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. పలు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి వేలాది రూపాయల ఫీజు వసూలు చేస్తున్నా మున్సిపాలిటీకి పన్నులు చెల్లించడం లేదని మండిపడ్డారు. ప్రధాన రహదారులే కాకుండా అంతర్గత రోడ్లు, అభివృద్ధి పనులకు ప్రతి వార్డుకు రూ.50లక్షల నుంచి కోటి రూపాయల వరకు కేటాయించాలని ప్రతిపాదించగా సభ సానుకూలంగా స్పందించింది. సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, ఫ్లోర్ లీడర్లు అభిమన్యు శ్రీనివాస్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, బండారు ప్రసాద్, కౌన్సిలర్లు ఫర్జానా ఫర్హత్ ఇబ్రహీం, యామ కవితాదయాకర్, ఆలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, మారగోని భవాని, శ్రీనివాస్, అశ్వినీ భాస్కర్ పాల్గొన్నారు.