బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 4 : విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించేందుకు చెస్ దోహదపడుతుందని సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ అన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా చెస్ టోర్నమెంట్ (అండర్ 9, 11, 13, 15)బాల బాలికల పోటీల్లో విజేతలైన వారికి ఆయన మెడల్స్ మాట్లాడారు.
చెస్‌లో ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడానికే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ పోటీలకు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎల్.సతీశ్‌కుమార్, ఆర్బీటర్స్ వీరప్రసాద్, రవి, జానయ్య, చెస్ అసోసియేషన్ సభ్యులు కరుణాకర్, ఎం.సాయికుమార్, లింగారెడ్డి, మురళి, కవిత పాల్గొన్నారు.
విజేతలు వీరే : అండర్15 బాలికల విభాగంలో ప్రథమ కె.చిద్విలాసిని, ద్వితీయ వి.వర్షిణి, తృతీయ పి.మేఘన, బాలుర విభాగంలో ప్రథమ ఎస్.ప్రశాంత్, ద్వితీయ బి.హర్షిత్, తృతీయ ఎస్.కె.ఫర్హాన్, అండర్ 13 బాలురలో ప్రథమ ఎస్.వివేక్, ద్వితీయ ఆకాశ్వరుణ్, తృతీయ ఇ.అఖిలేశ్, అండర్ 9 బాలుర విభాగంలో ప్రథమ బి.శ్రీవాత్సవ్, ద్వితీయ బి.దీక్షిత్ సింగ్‌నాయక్, తృతీయ బి.నిహాల్ చందన్ విజేతలుగా నిలిచారు.