మునుగోడు ప్రజా దీవెన సభకు టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన సభకు పెద్దసంఖ్యలో తరలివచ్చేందుకు జనం సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సభ నిర్వహణ కోసం విస్తృతమైన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. సభ నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించిన వెంటనే టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్యులంతా రంగంలోకి దిగారు. త్వరలో మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో స్థానికుల ఆకాంక్షను ప్రతిబింబించేలా సభ నిర్వహించేందుకు సంకల్పించారు. విస్తృత ప్రచారం కల్పించి క్షేత్రస్థాయి వరకు ప్రజలను కదిలించేలా కార్యాచరణ రూపొందించారు. మండలాల వారీగా ఇన్‌చార్జీలుగా నియమితులైన జిల్లా ప్రజాప్రతినిధులు శనివారం నుంచే సన్నాహక సమావేశాలు మొదలుపెట్టారు. ఆది, సోమవారాలు కూడా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి సన్నద్ధం చేయనున్నారు. సభ అనువైన స్థలాల కోసం పలు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం సాయంత్రం మరోసారి మునుగోడులో పర్యటించారు. చౌటుప్పల్ రోడ్డులో ఎంపీడీఓ కార్యాలయం దాటాక విశాలమైన స్థలాన్ని పరిశీలించి అక్కడే సభాస్థలిని ఫైనల్ చేశారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా దీవెన సభ ద్వారా మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను, మోసపూరిత చర్యలను ఎండగట్టడమే లక్ష్యమని మంత్రి గుంటకండ్ల ప్రకటించారు.
నియోజకవర్గంలో త్వరలో జరుగబోయే ఉప ఎన్నిక ద్రోహులు, కాంట్రాక్టర్లు – మునుగోడు ప్రజల చైతన్యానికి మధ్య జరిగే ఎన్నిక. ప్రజాద్రోహి రాజగోపాల్‌రెడ్డి. 21వేల కోట్ల కాంట్రాక్టు వచ్చాకే కాంగ్రెస్‌ను వీడి బీజేపీ పంచన చేరాడు. మునుగోడు అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమని ఇక్కడి ప్రజలకు తెలుసు. మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ తరిమేసిన ఘతన సీఎం కేసీఆర్‌దే. కేసీఆర్, టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్‌రెడ్డికి లేదు.
– గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : త్వరలో జరుగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు “మునుగోడు ప్రజా దీవెన సభ” నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సభకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో జనం కూడా భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా తరలొచ్చేలా కనిపిస్తున్నది.
రెండు రోజుల కిందటే సభ నిర్వహించాలని నిర్ణయించగా నియోజకవర్గ వ్యాప్తంగా అందరి దృష్టి దీనిపై కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలంతా రంగంలోకి దిగారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని అంచనా వేస్తున్న పార్టీ నేతలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లపై దృష్టి సారించారు. నారాయణపురం, మునుగోడు మండలాల్లోని పలు చోట్ల స్థలాలను పరిశీలించిన మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైనల్‌గా మునుగోడు సమీపంలో సభకు అనుకూలంగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేశారు.
మునుగోడు నుంచి చౌటుప్పల్‌కు వచ్చే రహదారి పక్కన ఎంపీడీఓ కార్యాలయం దాటక విశాలమైన స్థలాన్ని సభ నిర్వహణకు ఫైనల్ చేశారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి సభాస్థలిని పరిశీలించి, ఏర్పాట్లను సమీక్షించారు. ప్రస్తుతం అక్కడ సుమారు 30 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నదని, అవసరాన్ని బట్టి మరింత స్థలాన్ని కూడా తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
సభాస్థలికి కొద్ది దూరంలోనే పార్కింగ్‌కు అనువైన స్థలాలను కూడా ఎంపిక చేశారు. అంతకుముందు టీఎస్ఐఐసీ చైర్మన్ గాదరి బాలమల్లు, తదితరులు కలిసి సభాస్థలిలో వేదిక, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. సభకు వచ్చే జనాలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా విస్త్రతంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్న విషయం తెలిసిందే. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైనందున మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 2014 కంటే ముందు ఇక్కడ ఉన్న పరిస్థితులు.. ప్రస్తుతం నియోజకవర్గంలోని పరిస్థితులు, స్థితిగతుల్లో మార్పులపై ఎక్కువగా ఫోకస్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
సమైక్య పాలనలో ప్రధానంగా తాగు, సాగు నీరు లేక ఫ్లోరైడ్ ఎలా వృద్ధి చెందింది? కరువు కాటకాల దుస్థితి, వృత్తిదారులు, నేత కార్మికుల అవస్థలు ఇలా అనేక అంశాల్లో ఆప్పటికీ ఇప్పటికీ తేడాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. ఈ సభ ద్వారా కూడా కేంద్రంలోని మోదీ సర్కార్ వైఫల్యాలను, ప్రజలపై మోపుతున్న భారాలను, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న తీరును పార్టీ అధినేత కేసీఆర్ ఎండగట్టనున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.
ఇక రాజగోపాల్‌రెడ్డి కేవలం తన కాంట్రాక్టుల కోసమే బీజేపీతో ములాఖత్ అయి ఉప ఎన్నికకు కారకుడయ్యాడని, ఆయన చెబుతున్న అభివృద్ధి నినాదంలో సొంత అభివృద్ధే దాగి ఉందంటూ విమర్శించారు. మునుగోడు అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే మొదలైనదని, అది కొనసాగాలంటే మళ్లీ ఇక్కడ అధికార టీఆర్ఎస్ గెలుపు అవసరం ఉన్నదని చాటిచెప్పడమే ప్రజా దీవెన సభ ఉద్దేశ్యమని వెల్లడించారు.
సభకు విస్తృత ప్రచారం కల్పిస్తూ ప్రజలు తరలొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అందుకోసం నియోజకవర్గంలోని మండలాల వారీగా ఇన్చార్జీలను నియమించారు. సభ జరుగనున్న మునుగోడు మండలానికి మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా బాధ్యతలు తీసుకోవడంతో పాటు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
మంత్రి శనివారం సాయంత్రం సన్నాహాక సమావేశంలో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీకి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, రూరల్ మండలానికి ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి ఇన్‌చార్జీలుగా వ్యవహరించనున్నారు.
వీరు సైతం శనివారం పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఇక సంస్థాన్ నారాయణపురం మండలానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌లు ఇన్‌చార్జీలుగా రంగంలోకి దిగారు. ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు జరుపనున్నారు. చండూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రూరల్ మండలంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్ ఇన్‌చార్జీలుగా రంగంలోకి దిగి పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు.
నాంపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ బాధ్యతలు తీసుకున్నారు. మర్రిగూడ మండలానికి పార్టీ ఇన్చార్జీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తుండగా ఆదివారం పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. సభ పూర్తయ్యేంత వరకు వీరంతా పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలను సన్నద్ధం చేస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చేలా చర్యలు చేపట్టనున్నారు.