ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కొంతకాలం నుంచి విధులకు దూరంగా ఉన్న అందరినీ తిరిగి తీసుకుంటున్నట్లు బుధవారం ప్రకటించింది. గురువారమే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికి రిపోర్ట్ చేయాలని సూచించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనస్సుతో తిరిగి అవకాశం కల్పించడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫీల్డ్ అసిసెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సర్కారు నిర్ణయంతో యాదాద్రి భువనగిరి
నల్లగొండలో 446మంది ఫీల్డ్ అసిసెంట్లకు ఊరట లభించింది.నల్లగొండ ఆగస్టు 10 : ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, రూరల్ డెవలప్మెంట్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్న వాగ్దానాన్ని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ట్రెజరీ ఆఫీసుల నుంచి జీతాల చెల్లింపు సహా ఇతర డిమాండ్ల సాధనకు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం వీరిని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. మంత్రి దయాకర్‌రావుతో తమ బాధను పలుమార్లు పంచుకోగా సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. విజ్ఞప్తుల అనంతరం మానవతా హృదయంతో సీఎం సానుకూలంగా స్పందించి తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో యా దాద్రి జిల్లాలో 275, నల్లగొండలో 446, సూర్యాపేటలో 323 మొత్తం 1044 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రయోజనం చేకూరనుంది. వీరంతా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఫీల్డ్ అసిస్టెంట్లు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సూర్యాపేట రూరల్ : ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చిత్రపటాలకు ఫీల్డ్ అసిస్టెంట్లు క్షీరాభిషేకం చేశారు. తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాము, మండలాధ్యక్షుడు శ్యామల భూపాల్‌రెడ్డి, యాదయ్య, నాగయ్య, కృష్ణయ్య, రమణమ్మ, కవిత, సురేందర్, పుష్పలత, వెంకన్న, మంజుల, మదార్‌బి పాల్గొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. నిండు అసెంభ్లీలో ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి చేర్చుకుంటామని సీఎం ఇచ్చిన హామీ మేరకు మాటకు కట్టుబడి ఉన్న ఏకైక సీఎం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాల్లో వెలుగులు నింపడం హర్షించదగ్గ విషయం.
ఎర్ర బుచ్చయ్య, సంఘం జిల్లా జేఏసీ చైర్మన్
అంధకారంలో మునిగిన మా జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తిరిగి మా ఉద్యోగాలు మాకు వస్తున్నాయి. ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న మాకు ప్రభుత్వ ప్రకటన చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది.
– బాలలక్ష్మి, మహబూబ్‌పేట, యాదగిరిగుట్ట మండలం