కుట్రలు పారకపోవడంతో ఇప్పుడు మిల్లర్లు, అనుబంధ రంగాలపై కక్ష గట్టింది. రైతన్నకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో ధాన్యమంతా మిల్లులకు చేరగా, కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణకు ససేమిరా అంటున్నది. అసంబద్ధ కొర్రీలతో అనేక ఆటంకాలు సృష్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఎఫ్‌సీఐ ఈ నెల 8 నుంచి గింజ బియ్యం కూడా తీసుకోకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని పారబాయిల్డ్ రైస్ మిల్లులన్నీ మూతపడ్డాయి.
దాంతో మిల్లర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. రైస్ ఇండ్రస్టీస్పై ఆధారపడిన దాదాపు 20 వేల మంది హమాలీ కార్మికులు, మిల్లు డ్రైవర్లు, గోదాం హమాలీలు, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు పని లేక ఇబ్బందులు పడుతున్నారు. బీహార్‌తోపాటు ఇతర రాష్ర్టాల కార్మికులు ఉపాధి కరువై ఇంటి బాట పడుతున్నారు.
ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడంతో లారీ యజమానులకు సైతం కిరాయిలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీరును నిరసిస్తూ హమాలీతోపాటు ఇతర కార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 30 వరకే సీఎంఆర్ సేకరిస్తామని గడువు పెట్టిన ఎఫ్‌సీఐ 16 రోజులుగా సేకరణ నిలిపేయడం కుట్రపూరిత వైఖరిని స్పష్టంచేస్తున్నది.
నల్లగొండ ప్రతినిధి, జూన్ 23(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎఫ్‌సీఐ సీఎంఆర్ సేకరణలో కొర్రీల మీద కొర్రీలు పెడుతూనే ఉన్నది. ఉచిత బియ్యం పంపిణీ సమస్యతో పాటు రైస్ మిల్లుల్లో నిల్వల్లో తేడాలు ఉన్నాయన్న సాకులతో ఈ నెల 8 నుంచి ఎఫ్‌సీఐ పూర్తిస్థాయిలో సీఎంఆర్ సేకరణను నిలిపివేసింది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని సాంకేతిక కారణాలతో గత నెల నుంచి కాకుండా ఈ నెల నుంచి రేషన్‌కార్డు దారులకు అందజేస్తున్నారు.
దాంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యానికి రైస్ మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వల్లో తేడాలున్నాయనే కారణాన్ని కూడా ముందుకు తెచ్చారు. అయితే రాష్ట్రంలోని మూడు నాలుగు జిల్లాల్లోనే ఈ సమస్య తలెత్తగా అన్ని జిల్లాల్లోనూ సీఎంఆర్ సేకరణను ఆపేశారు. పైగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా కూడా ధాన్యం నిల్వల్లో తేడాలు రాలేదు. ఇక్కడ తప్పు జరుగకపోయినా అంతటా ఒకే శిక్ష అన్న తరహాలో ఎఫ్‌సీఐ వ్యవహరిస్తుండడం తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నది.
ఎఫ్‌సీఐ అసంబద్ధ నిర్ణయాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 210 రైస్‌మిల్లుల్లో సీఎంఆర్ సేకరణ నిలిచిపోయింది. దాంతో మిల్లులన్నీ 16 రోజులుగా మూతపడ్డాయి. నల్లగొండ జిల్లాలో 100, సూర్యాపేటలో 70, యాదాద్రిభువనగిరి జిల్లాలో 40 పార్బాయిల్డ్ రైస్‌మిల్లులు తెరుచుకోవడం లేదు. ఈ మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. దాంతో పాటు ఇప్పటికే సీఎంఆర్‌కు ఇచ్చేందుకు సిద్ధం చేసిన బియ్యం సుమారు 1500 మెట్రిక్ టన్నుల వరకు మిల్లుల్లోనే ఉన్నట్లు అంచనా. ఇవి మరికొద్ది రోజులు ఉంటే రంగు మారడంతో పాటు పురుగు పట్టే ప్రమాదం పొంచి ఉంది.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ఎఫ్‌సీఐకి అప్పగించడంలో రైస్‌మిల్లర్ల పాత్రే కీలకం. ఎఫ్‌సీఐ తీరుతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిల్లర్లంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మిల్లుల్లో ఇప్పటికే సిద్ధం చేసిన బియ్యం నిల్వలు ఉన్నాయని, మరింత ఆలస్యమైతే ఇవి రంగుమారి, పురుగు వచ్చినా ఇబ్బందే. ఇందులో ఏది జరిగినా ఎఫ్‌సీఐనే నిబంధనల పేరుతో సీఎంఆర్ తీసుకోకుండా నిరాకరిస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది.
తీసుకోకుంటే ఆ భారం రైస్ మిల్లర్లపైనే పడనున్నది. ఇదే సమయంలో రైస్‌మిల్లులు నడిపినా… నడపకపోయినా ప్రతి మిల్లుకు కనీస కరెంటు బిల్లు చెల్లించక తప్పదు. ఇది కూడా ఇబ్బందికరంగా మారనున్నది. దాంతో పాటు ఎఫ్‌సీఐ ప్రస్తుత సీఎంఆర్ సేకరణకు ఈ నెల 30వ తేదీని తుదిగడువుగా విధించింది. ప్రస్తుతం 16 రోజులు సేకరణ బంద్ చేయడంతో మిగిలిన ధాన్యాన్ని గడువులోగా సీఎంఆర్ చేయడం ఏలా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. జిల్లాలోని రైస్‌మిల్లర్లు కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైస్ ఇండ్రస్ట్రీస్లో ప్రస్తుతం పెద్ద సంఖ్యలో బీహార్‌తో పాటు ఇతర రాష్ర్టాల కార్మికులు హమాలీలుగా పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వీరి సంఖ్య మూడు నుంచి నాలుగు వేలకు పైగానే ఉంటుంది. ఎఫ్‌సీఐ తీరుతో 15 రోజులుగా మిల్లులన్నీ మూత పడడంతో వీరికి ఉపాధి లేకుండా పోయింది. పనిలేకుండా పూట గడవడం కష్టంగా మారడంతో కొందరూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. వీరు వెళ్లిపోతే ఎఫ్‌సీఐ మళ్లీ సీఎంఆర్ సేకరణ ప్రారంభించినా హమాలీలు సరిపడా లేక మిల్లింగ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని రైస్‌మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే గడువులోగా సీఎంఆర్ ఇవ్వకపోయినా ఇబ్బందికరంగా మారనున్నది. ఎఫ్‌సీఐ కొర్రీలతో ముందు చూస్తే గొయ్యి వెనక్కి చూస్తే నుయ్యిలా పరిస్థితి మారింది.
ఎఫ్‌సీఐ వ్యవహారశైలి ట్రాన్స్‌పోర్టు రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. రైస్ మిల్లింగ్ జరిగితే ఎగుమతులు, దిగుమతుల రూపంలో లారీలకు గిరాకీ ఉంటుంది. సీఎంఆర్ పూర్తైన బియ్యాన్ని గోదాములకు తరలించడంలో లారీలదే కీలకపాత్ర. రెగ్యులర్‌గా సీఎంఆర్ సేకరణ జరిగితే నిత్యం కిరాయిలతో లారీ యజమానులకు ఉపాధి లభించేది.
ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న ట్రాన్స్‌పోర్టు రంగానికి ఎఫ్‌సీఐ నిర్ణయం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దాంతో లారీల యజమానులతో పాటు డ్రైవర్లు, క్లీనర్లకు కూడా ఉపాధి సమస్య ముందుకు వస్తున్నది. కేవలం రైస్ ఇండ్రస్టీస్పైనే ఆధారపడి తిరిగే లారీలు కూడా పెద్దసంఖ్యలో ఉంటాయి. వీటన్నింటికీ ప్రస్తుతం నెలవారీ కిస్తులు, జీతభత్యాల చెల్లింపులోనూ ఇక్కట్లు ఎదురవుతున్నాయి.
ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ సేకరణపై ఆధారపడి రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మంది హమాలీలు, మిల్లు, ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ వీరి సంఖ్య 20 వేల వరకు ఉంటుందని అంచనా. ముఖ్యంగా రైస్ ఇండస్ట్రీస్‌లో ఎగుమతి, దిగుమతుల్లో కీలకమైన హమాలీ కార్మికులు పెద్దసంఖ్యలో ఉన్నారు.
వీరంతా రోజు వారీ కూలీలుగా ఏండ్ల తరబడి పనిచేస్తున్నారు. సీఎంఆర్ సేకరణ నిలిపివేయడంతో రైస్‌మిల్లులు మూతపడి వీరికి పనిలేకుండా పోయింది. వీరితో పాటు మిల్లు డ్రైవర్లు, గుమస్తాలు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, స్టేట్ వేర్ హౌసింగ్, సెంట్రల్ వేర్‌హౌసింగ్, ఎఫ్‌సీఐ గోదామ్ల కార్మికులు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరందరూ కూడా ఎఫ్‌సీఐ నిర్ణయంతో ఉపాధి కోల్పోతున్నారు. కొందరూ కార్మికులు అప్పులు చేసి జీవనం వెళ్లదీస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ నెల 8 నుంచి ఎఫ్‌సీఐ సీఎంఆర్ సేకరణను నిలిపివేసింది. దాంతో రైస్‌మిల్లుల్లోని కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. సీఎంఆర్ ఇచ్చేందుకు జిల్లాలోని చాలా మిల్లుల్లో బియ్యం సిద్ధం గా ఉన్నాయి. ఇంకా ఆలస్యమైతే ఈ బియ్యం రంగుమారి, పురుగుపట్టే ప్రమాదం లేకపోలేదు.
ఈ నెల 30 వరకే సీఎంఆర్ సేకరణకు ఎఫ్‌సీఐ తుదిగడువు విధించింది. 15 రోజులుగా సేకరణ నిలిపివేయడంతో ఇప్పటికిప్పుడు ప్రారంభించినా గడువులోగా పూర్తి చేయడం కష్టసాధ్యమే. ఎఫ్‌సీఐ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం.
– వూర వెంకటేశ్వర్లు, డీఎస్ఓ, నల్లగొండ
మూతపడిన రైస్‌మిల్లులను వెంటనే తెరిచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీన నల్లగొండలోని ఎఫ్‌సీఐ జిల్లా కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాం. ఎఫ్‌సీఐ సేకరణ నిలిపివేయడంతో రాష్ట్రంలోని 1500 రైస్ మిల్లులు మూతపడ్డాయి.
వీటిల్లో సుమారు 2లక్షల మంది హమాలీలు, మిల్లు డ్రైవర్లు, దినసరి కూలీలు, ట్రాన్స్‌పోర్టు కార్మికులు, గోదాం హమాలీలు పనిచేస్తున్నారు. ఎఫ్‌సీఐ తీరుతో వీరందరూ రోడ్డున పడ్డారు. తక్షణమే మిల్లులు తెరిచి ఉపాధి కల్పించాల్సి ఉంది.
– తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్
సీఎంఆర్ బియ్యం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ అనుసరిస్తున్న విధానాలతో రైస్ మిల్లర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లులు మూతపడే పరిస్థితి నెలకొంది. మిల్లుల్లో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో కొత్తగా మిల్లుంగ్ చేసే పరిస్థితి లేదు.
దాంతో హమాలీలకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో మిల్లుల యజమానులు, వేలాది మంది కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎఫ్‌సీఐ అధికారులు వెంటనే కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను తీసుకోవాలి.
-చిట్టిపోలు యాదగిరి, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు