భువనగిరి అర్బన్, మే 24 : రాజ్యాంగం, చట్టపరంగా మహిళలకు లభించిన హక్కులను కాపాడటమే లక్ష్యమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్‌హాల్‌లో వివిధ మహిళా సంఘాలు, ఆశ, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులతో మహిళా హక్కులు, సాధికారితపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల హక్కులపై పెద్ద ఎత్తున సదస్సులు ఏర్పాటు చేసి మహిళలతో పాటు పురుషులకూ అవగాహన కల్పించాలని సూచించారు.
మహిళలు ఇబ్బందులకు గురయ్యే ప్రాంతానికి వెళ్లి వారికి రక్షణ కల్పించడం, విద్యాసంస్థలు, వసతి గృహాలు, వర్కింగ్ ఉమెన్స్ సెంటర్లను తనిఖీ చేసే అధికారం కమిషన్‌కు ఉంటుందన్నారు. మహిళా రక్షణకు వరకట్న నిషేధ చట్టం, హిందూ వివాహచట్టం, బాల్య వివాహాల నిషేధం, నిర్భయ, పొక్సోచట్టం, సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్, మెయింటెనన్స్ చట్టాలు తెచ్చినట్లు తెలిపారు. ఆయా చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు.
సఖి హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ ద్వారా, పోస్టల్, ట్విట్టర్, ఈ మెయిల్ వంటి వాటి ద్వారా లేదా కమిషన్ నంబర్ 9490555533కు మహిళలు తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. ప్రభుత్వం కల్పించే వసతులను బాధిత మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. మ్యారేజ్ యాక్టు ప్రకారం ప్రతి పెండ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ఈ విషయమై గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా లీగల్ సెల్ ద్వారా ఉచిత న్యాయసేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలు, స్త్రీ నిధి రుణాలు లక్ష్యాలకు మించి ప్రగతి సాధించడంపై.. గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, తల్లులకు అందిస్తున్న సేవలు, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ఆమె అభినందించారు. లింగ నిర్థారణ చేసే స్కానింగ్ సెంటర్లను మూసి వేయించాలని ఆదేశించారు. మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధిత మహిళలకు త్వరగా న్యాయం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల ఆరోగ్యం, సంక్షేమం పట్ల అనేక పథకాలు అమలు చేస్తున్నారని, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో నాణ్యమైన భోజనవసతి, విద్య అందిస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. షీ టీమ్, సఖి సెంటర్లు, సైబర్ టీమ్‌లు, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటుతో మహిళలు మోసపోకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం మహిళ హక్కులను కాపాడతామని, వారి గౌరవానికి భంగం కలిగే పనులు చేపట్టమని ప్రతిజ్ఞ చేయించారు.