నల్లగొండ, జనవరి 16 : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 13న భోగి, 14న మకర సంక్రాంతికి సెలవులు ఇచ్చిన ప్రభుత్వం 15వ తేదీన మాత్రం కనుమ రోజున వర్కింగ్ డేగా అమలు చేసింది. అంతకు ముందే ఆదివారం కలిసి రావడంతో సొంత ఊర్లకు వెల్లిన ఉద్యోగులు బుధవారం మాత్రం ఆప్షనల్ హాలిడేగా పెట్టుకొని గైర్హాజరయ్యారు. ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగుల్లో 50 శాతానికి పైగానే డ్యూటీల్లో లేకుండా డుమ్మా కొట్టారట.
దీంతో సీరియస్ అయిన కలెక్టర్ ఇలా త్రిపాఠి మెమోలు ఇచ్చి సంజాయిషీ కోరారు. మెమోలు ఇచ్చిన వారిలో ఉన్నతాధికారులే 14 మంది ఉండటంతో కలెక్టర్ సీరియస్ అయినట్లు సమాచారం. బుధవారం ఉదయమే కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యక్షంగా గుర్రంపోడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయగా ఎనిమిది మంది డ్యూటీలకు రాలేదు. దాంతో ఎలాంటి సమాచారం లేకుండా విధుల్లో పాల్గొనని ఎనిమిది మంది ఉద్యోగులను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు.
జిల్లాలోని అన్ని శాఖల్లోనూ కనుమ రోజున ఇదే తంతు జరిగిందని విధులకు హాజరైన ఉద్యోగులు చర్చించుకున్నారు. ఈ విషయమై కలెక్టర్ దృష్టికి కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ ఆరా తీసిన ఆమె సంబంధిత అధికారులు, కింది స్థాయి ఉద్యోగులపైన సీరియస్ అయి మెమోలు జారీ చేశారు. ఇదిలా ఉండగా స్థానికంగా ఉండే ఉద్యోగుల్లో కూడా సింహభాగం ఆఫీసుకు వచ్చి సంతకం చేసి ఇంటిబాట పట్టినట్లు ఇతర ఉద్యోగులు అంటున్నారు.
వీరిపైనా ఆరా తీసి మెమోలు ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న వారి పట్ల కలెక్టర్ వేటు వేస్తుండటంతో ఉద్యోగుల్లో అలజడి కనిపిస్తున్నది. ఇటీవల ఓ జిల్లా అధికారిని సరెండర్ చేసిన ఆమె ఒక వ్యవసాయ అధికారితో పాటు పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి పలువురికి మెమోలు జారి చేశారు. ఈ నెల 14న కూడా గుర్రంపోడ్లో 8 మందిపై వేటు వేసిన ఆమె అదే రోజు డ్యూటీలకు రాని వారందరికీ మెమోలు ఇవ్వటం గమనార్హం.