
నాడు ఆవాసం.. నేడు నూతన పంచాయతీ
మౌలిక సౌకర్యాల కల్పనలో నంబర్ వన్
మూడేండ్లలోనే మారిన గ్రామ ముఖచిత్రం
హైవేకు అతి దగ్గరగా ఉన్నా ఆ గ్రామం
గతంలో అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచింది. ఆవాసం కావడంతో నిధుల కొరత వల్ల ఏండ్ల తరబడి సమస్యలు తిష్ఠవేశాయి. మౌలిక వసతులు లేక ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోగా వీధులన్నీ మురుగు గుంతలమయమై అపరిశుభ్రంగా కనిపించేవి. కానీ, రాష్ట్ర ఏర్పాటుతో ఆ పల్లె ముఖచిత్రం మారిపోయింది. పంచాయతీగా ఆవిర్భవించగా పల్లె ప్రగతి కార్యక్రమం వరంలా మారి సకల సౌకర్యాలను సమకూర్చుకున్నది తిప్పర్తి మండలంలోని అంతయ్యగూడెం. చుట్టూ పచ్చని పొలాలు, సమీపంలో చెరువు.. హరితహారంలో నాటిన మొక్కలు గ్రామానికే
వన్నెతెస్తున్నాయి.
అద్దంకి నార్కట్పల్లి హైవేకు అతి దగ్గరలో ఇండ్లు కనిపిస్తున్నా అది గ్రామం అని కొత్త వారికి ఏ మాత్రం తెలియదు. గతంలో అక్కడికి అధికారులు గానీ, ప్రజాప్రతినిధులుగానీ వెళ్లేవారు కాదు. దుప్పలపల్లి గ్రామపంచాయతీ ఆవాసం కావడంతో ఎవ్వరూ పట్టించుకోక అభివృద్ధిలో వెనుకబడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అంతయ్యగూడేనికి మంచి అవకాశాలు దక్కాయి. కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయడంతో పాలనా పగ్గాలు చేతికందాయి. స్వపరిపాలనకు తోడు పల్లె ప్రగతి కార్యక్రమం వరంలా మారింది. ప్రస్తుతం అంతయ్యగూడేనికి బీటీ రోడ్డు, వీధుల్లో సీసీ రోడ్లు, ఆవాసమైన గొల్లగూడేనికి కూడా రోడ్డు సౌకర్యం కల్పించారు. నిధుల కొరత లేకపోవడంతో అభివృద్ధి పనులు శరవేగంగా చేపడుతున్నారు.
అభివృద్ధి పనులివీ..
రూ.12లక్షలతో శ్మశానవాటిక నిర్మించారు. రూ.2లక్షలతో డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్డు ఏర్పాటు చేశారు.
రూ.2లక్షలతో పల్లె ప్రగతి పార్కు ఏర్పాటు చేసి 3వేల మొక్కలు నాటించారు.
గ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లాలు బిగించి తాగునీరు సరఫరా చేస్తున్నారు.
అదనంగా రెండు బోర్లు వేయించి నీరు అందిస్తున్నారు.
గొల్లగూడెంలో కొత్తగా పైపులైన్లు వేయించారు.
హైవే నుంచి అంతయ్యగూడెం వరకు రూ.45లక్షలతో బీటీ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్లు నిర్మించారు.
ఎన్ఆర్ఈజీఎస్, ఎస్డీఎఫ్ నిధులు రూ.25లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. చుట్టూ పంట పొలాలు, పక్కనే చెరువు ఉండడం వల్ల గ్రామానికి కొత్త శోభ చేకూరింది.
ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయడంతో మా కష్టాలు తొలగిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం వల్ల మా గ్రామాన్ని మేమే అభివృద్ధి చేసుకొనే అవకాశం దక్కింది. మూడేండ్లలోనే ఎన్నో పనులు చేయించాం. పల్లె ప్రగతి నిధులతో గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నాం.
మా గొల్లగూడెంలో గతం లో బజార్లు గుంతలు పడి ఉండేవి. కానీ, అంతయ్యగూడెం పంచాయతీ కావడంతో మా గూడేన్ని కూడా అభివృద్ధి చేసినరు. సీసీ రోడ్లు వేసినరు. ఈ మూడేండ్లలోనే మా ఊరు బాగుపడింది.