
ప్రభుత్వ భూముల లెక్కలు, విస్తీర్ణం తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఎన్ని? ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? వాటి హద్దు బంధులు ఏమిటి? వంటి సమగ్ర వివరాలను పూర్తి స్థాయిలో సేకరించేందుకు క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టారు. ప్రభుత్వ, బంచరాయి, సీలింగ్ ఇలా రకాలను బట్టి పూర్తి వివరాలతో ప్రత్యేక రికార్డులను నిర్వహించనున్నారు. ఈ రికార్డుల ఆధారంగా జియో మ్యాపింగ్ కూడా
చేసి, భవిష్యత్తులో ఈ భూముల జోలికి ఎవ్వరూ వెళ్లలేని విధంగా కట్టుదిట్టం చేయనున్నారు. అందుకోసం అన్ని మండలాల్లోనూ తాసీల్దార్లు దీనిపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చి, జియో మ్యాపింగ్ పూర్తి చేసిన అనంతరం సీలింగ్, ఇతర భూముల వివరాలతో ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నారు.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : అక్కడక్కడ ప్రభుత్వ భూముల ఆక్రమణ, అన్యాక్రాంతం, దొడ్డిదారుల్లో ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం లాంటివి ఇకముందు ఉండకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఆదేశించింది. ఇప్పటికే ప్రభుత్వం ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్లు, భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకతను ప్రదర్శిస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేసింది. వెనకదారుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, దందాలు, లంచాలకు తెరవేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే క్రమంలో అన్ని రకాల ప్రభుత్వ భూముల సంరక్షణకు నడుం బిగించింది. ఈ నెల 4న హైకోర్టు కూడా ప్రభుత్వ భూములపై పిల్ నంబర్ 198/2020ను విచారిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భూములను సర్వే చేసి, జియో మ్యాపింగ్‌తో రికార్డు రిజిస్ట్రర్‌ను నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను నిగ్గు తేల్చేందుకు సిద్ధపడింది. జిల్లా అధికార యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించారు. కలెక్టర్ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తాసీల్దార్లు, సర్వేయర్లు దీనిపైనే ప్రస్తుతం పనిచేస్తున్నారు. జిల్లా కేంద్రాల నుంచి ఇప్పటికే పలుమార్లు దీనిపై వీడియో, సెల్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి తగు సూచనలు చేశారు. ప్రభుత్వ భూముల సర్వేకు తాసీల్దార్లు, సర్వేయర్లు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ సంబంధిత అధికారుల, సిబ్బంది దీనిపై కేంద్రీకరించి పని చేస్తున్నారు.
ప్రతి మండల తాసీల్దార్ ఆధ్వర్యంలో ఆ మండలానికి చెందిన ప్రభుత్వ భూముల ల్యాండ్ బ్యాంక్ రిజిస్టర్ నిర్వహణ చేయాల్సి ఉంది. రెవెన్యూ గ్రామాల వారీగా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను మరోసారి సరిచూసి వీటన్నింటినీ సర్వేనంబర్ల వారీగా గుర్తించాలి. ఇలా గుర్తించిన అనంతరం వీటి సమగ్ర వివరాలు పొందుపరుస్తూ ప్రత్యేక రిజిస్టర్లు ఏర్పాటు చేయాలి. వివరాల నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేక ఫార్మెట్లను రూపొందించింది. ఈ ఫార్మెట్లల్లోని ప్రొఫార్మాల ఆధారంగా సర్వేనంబర్ల వారీగా ప్రభుత్వ భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే వివరాలను నమోదు చేయాలి. ఇందులోనే ప్రభుత్వ భూముల రకాలను కూడా ప్రత్యేకంగా పేర్కొనాల్సి ఉంటుంది. అయితే కొత్త పాసుపుస్తకాల జారీ సమయంలోనే ప్రభుత్వ, ప్రైవేటు భూములపై దాదాపు స్పష్టత వచ్చింది. ఆ సమయంలో పొందుపర్చిన వివరాలను ఆసరాగా చేసుకుని మరోసారి ప్రభుత్వ భూముల లెక్కలను సరిచూస్తున్నారు. ఇలా ప్రభుత్వ భూముల వివరాలతో ప్రత్యేక ల్యాండ్ బ్యాంకు రిజిస్టర్‌ను సిద్ధం చేస్తారు. ఇలా సిద్ధం చేశాక ఆ వివరాలతో క్షేత్రస్థాయిలో హద్దుబంధులతో వివరాలను ఆన్లైన్ చేయనున్నారు.
ప్రత్యేక ల్యాండ్ బ్యాంక్ రిజిస్ట్రర్ ఏర్పాటు చేసిన అనంతరం ఆ వివరాలను మండల సర్వేయర్లకు అందజేస్తారు. తాసీల్దార్ల పర్యవేక్షణలో వారు ప్రభుత్వ భూముల హద్దుబంధులను, విస్తీర్ణంతో సహా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా మ్యాపింగ్ చేస్తారు. రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం ఆధారంగా క్షేత్రస్థాయిలో కూడా అంతే విస్తీర్ణంతో కూడిన మ్యాప్‌లను సర్వేయర్ల సహకారంతో రూపొందించనున్నారు. అనంతరం ఈ మ్యాప్‌లను జియో ట్యాంగింగ్ చేస్తారు. దీంతో ఎవరూ ఎక్కడి నుంచైనా ప్రభుత్వ భూముల వివరాలను తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ప్రభుత్వ భూములును వక్రమార్గంలో విక్రయించాలని చూసినా, ఆక్రమించాలని చూసినా జియో మ్యాపింగ్ అడ్డుగా నిలవనుంది. అయితే ఈ జియో మ్యాపింగ్‌పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ సర్వేయర్లకు జియో మ్యాపింగ్‌పై ైస్లెడ్స్తో శిక్షణ కల్పిస్తున్నారు. జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీలు శిక్షణలో పాలుపంచుకుంటున్నారు. జియో మ్యాపింగ్ పూర్తయ్యాక ప్రభుత్వం సూచించిన విధంగా ప్రొఫార్మాలో భూముల సమగ్ర వివరాలను కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, హైకోర్టుకు కూడా అందజేయనున్నారు. నల్లగొండ జిల్లాలో పక్షం రోజుల్లోనే ఈ వివరాలను సిద్ధం చేయాలన్న సంకల్పంతో అధికారులు పని చేస్తున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ భూముల సర్వే చేపట్టాం. ప్రభుత్వ భూముల వివరాలు ఇప్పటికే రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నాయి. వీటిని మరోసారి సరిచూసి వివరాలన్నింటినీ ప్రత్యేక ఫార్మెట్లో పొందుపరుస్తున్నాం. ఈ వివరాలతో ల్యాండ్ బ్యాంక్ రిజిస్ట్రర్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చాం. తదుపరి ఈ వివరాల ఆధారంగా జియో మ్యాపింగ్ కూడా చేస్తాం. వీటిని త్వరలోనే పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. ప్రభుత్వ భూముల అనంతరం సీలింగ్, ఇతర రకాల భూములపైనా దృష్టి పెడతాం. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇక ముందు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం అంటూ ఉండదు.