
అర్హత వయస్సు 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించిన సర్కారు
ఈ నెల 31వరకు గడువు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు 49,621 దరఖాస్తులు
కొత్తవారికి వచ్చేనెల నుంచి పింఛన్
మరింత మందికి ఆసరా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ల వయస్సును 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. అర్హులైన వారు ఈ నెల 31 వరకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో మీ సేవ కేంద్రాలకు జనం పోటెత్తుతున్నారు. ఈ నెల 16 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 49,621 మంది దరఖాస్తు చేసుకున్నారు. 57 ఏండ్లు పైబడిన వారు 64 వేల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించగా గడువు నాటికి మరో 15వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నది. జిల్లాలో ఇప్పటికే 3.99 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్ వస్తుండగా 65 ఏండ్లు ఉన్న 26 వేల మంది గతంలోనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం సుమారు 90 వేల పింఛన్లు కొత్తగా రానున్నాయి.
వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తుల వెల్లువ
నల్లగొండ, ఆగష్టు 25 : ఆసరా పథకం కింద పింఛన్లు అందించేందుకు అర్హత వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గించింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వరకు గడువు ఉండడంతో మీసేవ కేంద్రాలు దరఖాస్తు దారులతో నిండిపోతున్నాయి.
మీసేవ కేంద్రాల్లో రద్దీ
ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49, 621 మంది కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 57 ఏండ్లు పైపడిన వారు ఉమ్మడి జిల్లాలో 64వేల మంది ఉన్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు అంచ నా వేశారు. ఈ నెలాఖరు వరకు మరో 15వేల దాక దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 3.99 లక్షల మందికి ప్రభుత్వం పింఛన్ అందిస్తుండగా మరో 26 వేల మంది 65 ఏండ్లు పైబడిన వారి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ దరఖాస్తులు పూర్తయ్యాక వచ్చే నెల నుంచి నూతన పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
49, 621 దరఖాస్తులు
కొత్తగా ఆసరా పింఛన్ల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49, 621 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 22,412 మంది, సూర్యాపేటలో 15,809 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 11,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల అంచనా ప్రకారం రానున్న రోజుల్లో నల్లగొండ, సూర్యాపేట నుంచి ఆరు వేల చొప్పున, యాదాద్రి నుంచి మూడు వేల దరఖాస్తులు రానున్నాయి. ఈ నెల 31 వరకు దరఖాస్తుకు గడువు ఉంది.
ఇప్పటికే 3.99 లక్షల మందికి పింఛన్
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వృద్ధులతో పాటు వికలాంగులు, వితంతువులు, చేనేత, గీత, ఒంటరి మహిళలు, పైలేరియా, హెచ్ఐవీ వ్యాధి గ్రస్తులు ఇలా మొత్తంగా 3.99 లక్షల మందికి పింఛన్ అందుతున్నది. ఇందులో నల్లగొండ జిల్లాలో 1.77 లక్షల మంది, సూర్యాపేటలో 1.27 లక్షల మందికి, యాదాద్రి జిల్లాలో 94వేల మందికి అందుతున్నది. 65 ఏండ్లు పైబడ్డ వారు ఇప్పటికే 26 వేల మంది దరఖాస్తు చేసుకోగా 57 నుంచి 65 ఏండ్ల వయసున్న వారు మరో 49వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పాత పింఛన్ దారులకే ప్రభుత్వం ప్రతి నెలా రూ.98.38 కోట్లు ఖర్చు చేస్తున్నది.
నల్లగొండలో 22వేల దరఖాస్తులు
ఆసరా పింఛన్లకు సంబంధించి వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లకు తగ్గించడంతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటున్నారు. నల్లగొండలో ఇప్పటి వరకు 22,412 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. దరఖాస్తు సమయంలో మీ సేవ నిర్వాహకులు ఎవరైనా డబ్బులు తీసుకోవద్దని ఆదేశాలిచ్చాం.
-గఫార్, ఈ -డిస్ట్రిక్ట్ మేనేజర్, నల్లగొండ