
అర్వపల్లి మండలంలో 5,435 రైతులకు బీమా
ఇప్పటికి 80 కుటుంబాలకు రూ.4 కోట్ల సాయం
అర్వపల్లి, సెప్టెంబర్ 03 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుంది. అప్పటిదాకా అన్ని విధాలా అండగా ఉన్న ఆ ఇంటి పెద్ద ఉన్నట్టుండి కాలంచేస్తే, అటువంటి రైతు కుటుంబాలకు ప్రభుత్వం కల్పించిన బీమా గొప్ప అండగా ఉంటూ భరోసా కల్పిస్తుంది. ఆరుగాలం కష్టపడే రైతన్న అకాల మరణంతో కుటుంబం బజారున పడే దుస్థితి నుంచి బయటపడేసేదీ రైతుబీమా పథకం. స్వతంత్ర భారతంలో రైతు సంక్షేమం కోసం ఏ ప్రభుత్వాలూ చేయని ఆలోచన చేసి ఆచరణలో పెట్టిన సీఎం కేసీఆర్ అన్నదాత కుటుంబాల గుండెల్లో దేవుడిగా నిలిచారు. రైతు సహజ మరణం పొందినా లేదా ప్రమాదవశాత్తు మరణించినా రూ. 5 లక్షల బీమా వర్తింపజేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం దేశ చరిత్రలో నిలిచిపోయింది. రైతు మరణించిన వారం రోజుల్లో నామినీ పేర బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమకానుంది. ఈ పథకం కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరించింది. 18 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సు కలిగిన ప్రతి రైతు నుంచి అధికారులు దరఖాస్తు స్వీకరించి ఆన్లైన్ చేశారు.
మండలంలో 5,435 రైతు కుటుంబాలకు భరోసా
మండలంలో మొత్తం 9,101 మంది రైతులు ఉన్నారు. ఇందులో 17 గ్రామపంచాయితీల పరిధిలో 5,435 మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. గత మూడేళ్లలో 80 కుటుంబాలు రూ. 4 కోట్ల సాయం పొందాయి. మండలంలో 2018లో 22 మంది, 2019లో 21 మంది, 2020లో 38 మంది రైతులు మరణించగా 80 కుటుంబాలు ఈ పథకం కింద రూ. 5 లక్షల చొప్పున సాయాన్ని అందుకున్నాయి.
అర్హులను గుర్తించి ఆన్లైన్ చేశాం
రైతుబీమా పథకానికి మండలంలో అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేశాం. ఈ పథకానికి అర్హులైన రైతులు మృతిచెందిన వెంటనే బాధిత రైతు నామినీ బ్యాంకు ఖాతాలో రూ. 5 లక్షలు జమ అయ్యేలా చర్యలు చేపడుతున్నాం. ఈ పథకం రైతు కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది.