– చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం
కోదాడ, మే 12 : అధికార పార్టీ నాయకుల అండతో మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అక్రమంగా కబ్జాలు చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని, నిలువరించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులో లక్షల రూపాయల విలువ చేసే మున్సిపాలిటీ స్థలంలో అధికార పార్టీ నాయకుడు ఏకంగా భారీ డబ్బా కొట్టును ఏర్పాటు చేసి వారం రోజులు అవుతున్నప్పటికీ మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే కమిషనర్ తాత్సారం చేస్తుందన్నారు.
ఇప్పటికే పలుమార్లు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, ఆ వార్డు ప్రజలు కమిషనర్, ఆర్డీఓకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీంతో పాటు సూర్యాపేట వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంలో మట్టి పోసి ఆక్రమించుకుంటున్నారని ఈ అంశంలో జల వనరుల శాఖ అధికారులు గానీ, మున్సిపాలిటీ అధికారులకు గానీ చీమ కుట్టినట్టైనా లేదన్నారు. ఈ దురాక్రమణ విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని చర్యలు తీసుకుని ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పైడిమరి సత్యంబాబు, కౌన్సిలర్ చీమ నరేశ్, సంపేట ఉపేందర్, ఇమ్రాన్ ఖాన్, చలిగంటి వెంకట్, మాదల ఉపేందర్, గొర్రె రాజేష్, చీమ శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.