యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 9 : ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా గుట్ట అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచా రం ముగింపు సందర్భంగా సోమవారం యాదగిరిగుట్ట 9వ వార్డులో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆమె కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ మోసపు హామీలను ఎండగట్టారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, ఓడిపోయే కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు వస్తే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లడగుతున్నారని ప్రశ్నించాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిరాదరణకు గురైన గుట్ట దేవస్థానాన్ని రూ. 1380 కోట్లతో కేసీఆర్ ఎంతో గొప్పగా అభివృద్ధి చేశారన్నారు.
దీంతో పట్టణంలోని సుమారు 500 మంది నిరుద్యోగులకు కొండపై ఉపాధి లభించిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటేయాలన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి కావొద్దన్నారు. కార్యక్రమంలో 9వ వార్డు అభ్యర్థి దండెబోయిన మమతా అనిల్ యాదవ్, ఎన్నికల ఇంచార్జ్‌లు పసుల ప్రభాకర్‌రెడ్డి, కసావు శ్రీనివాస్ గౌడ్, కాల్నె అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.