గుండాల, మార్చి 17 : గుండాల మండలానికి నవాబ్‌పేట రిజర్వాయర్ నుంచి సాగు నీరు అందించి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పోరుబాట పట్టారు. దేవాదుల కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వాలంటూ సోమవారం బురుజుబావి గ్రామం నుంచి వెల్మజాల వరకు దేవాదుల కాల్వ కట్ట వెంట పాదయాత్ర చేశారు.
ఎండిన వరి పొలాలు, చుక్క నీరు లేని దేవాదుల కాల్వలను పరిశీలించారు. బురుజుబావి గ్రామంలో ఎండిన పంటలను చూపుతూ రైతులు గోడు వెల్లబోసుకున్నారు. కేసీఆర్ హయాంలో పంటలు బాగా పండాయని, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎండిపోయే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గొంగిడి సునీత, కంచర్ల మాట్లాడుతూ గుండాల మండలానికి నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు ఇవ్వాలని రైతులు పలుమార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా కనీస స్పందన కరువైందన్నారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏడు సార్లు సాగునీరు ఇచ్చి చెరువులు నింపామని గుర్తుచేశారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇకనైనా కండ్లు తెరువాలని, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి దేవాదుల మోటార్లు ఆన్ చేసి సాగు నీరు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎండీ ఖలీల్, మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మూగల శ్రీనివాస్ పాల్గొన్నారు.