– ప్రారంభించిన సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
– పోరాటం కమ్యూనిస్టులదైతే
– బీజేపీకెందుకు ఆర్భాటం ?
– త్యాగాలు కమ్యూనిస్టులవి, భోగాలు బీజేపీవా?
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 16 : కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో విష పురుగులైన కాషాయ ఉన్మాదులకు ఏమిటి సంబంధమని, మట్టి మనుషుల మహోన్నత పోరాట చరిత్ర గురించి మాట్లాడే నైతిక అర్హత మతోన్మాద బీజేపీకి లేదని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 సెప్టెంబర్ 17 వరకు జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో మచ్చుకైనా కనిపించని మతోన్మాదులు, ఆ పోరాటానికి వారసులమంటూ సభలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 1913లో హిందూ మహాసభ, 1925లో ఆర్ఎస్ఎస్, 1951లో జనసంఘ్ ఏర్పడితే ఆ పోరాటం జరిగిన కాలంలో మీరు ఎందుకు ఆ పోరాటంలో పాల్గొనలేదని ప్రశ్నించారు. విసునూర్ రామచంద్రారెడ్డి, ఎర్రబాడు దొరలు, భూస్వాములు, జాగీర్దారులు నిజాం సైన్యంలో అత్యధికులు తెలంగాణ గడ్డలోని మట్టి మనుషులను నానా చిత్ర హింసలు పెట్టారని, దోపిడీ చేశారని చెప్పారు.
విసునూర్ రామచంద్రారెడ్డిది ఏ మతమని ప్రశ్నించారు. అది హిందూ ముస్లింల పోరాటం కాదని, దోపిడీ చేసిన దోపిడీదారులు, దోపిడీకి గురైన పేదలు కూడా హిందువులేనని చెప్పారు. దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా తిరుగుబాటు అని చెప్పారు. ముస్లిం నైజాం, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ఈ మట్టి గడ్డమీద పుట్టిన మైనార్టీలైన ముస్లింలు ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. ముగ్ధుమ్ మోహినుద్దీన్, అలంకుంద్ మీరి కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారని, షోయబుల్లాఖాన్ సీనియర్ జర్నలిస్టుగా ఇమ్రేజ్ అనే పత్రిక నడిపించి నైజాం నిరంకుశ చర్యలను ఎండగడుతూ కథనాలు రాశాడని, నిలబెట్టి కాళ్లు, చేతులు నరికి కాచిగూడ రైల్వే స్టేషన్ లో చిత్రహింసలు పెట్టింది ముస్లిం రజాకారులు కాదా అని ప్రశ్నించారు. ఆ పోరాటంలో మొదటగా ప్రాణాలు ఇచ్చింది షేక్ బందగీ ముస్లిం కాదా అని ప్రశ్నించారు. ఆ ఉద్యమంలో అడుగడుగున ముస్లింలు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. 3 వేల గ్రామాలను విముక్తి చేసి గ్రామ రాజ్య కమిటీ ఏర్పాటు, చేసి 10 లక్షల ఎకరాల భూములు పంచి 4 వేల మంది అమరులైన వీరోచిత పోరాట గాధ అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట వాస్తవ చరిత్ర వారసులు ముమ్మాటికి కమ్యూనిస్టులేనని అన్నారు.
సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎర్ర జెండా పాతి సభ నిర్వహించాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్ అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బీజేపీ ఏ అర్హతతో సభ పెడుతుందని ఆయన ప్రశ్నించారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎర్ర జెండా వారసుల చరిత్ర అన్నారు. నాడు కమ్యూనిస్టులు పంచిన 10 లక్షల ఎకరాల భూముల్లో నేడు పాలకులు సుమారు 3 లక్షల ఎకరాల భూమిని వివిధ రూపాల్లో స్వాధీనం చేసుకున్నారని దుయ్యబట్టారు. భూమి కోసం, ప్రకృతి వనరుల సాధన కోసం అట్టడుగు వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. మహోన్నత చరిత్ర గురించి మతోన్మాదులకు మాట్లాడే నైతిక అర్హత లేదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నలుపరాజు సైదులు, మండల కమిటీ సభ్యులు కొండ వెంకన్న, పోలె సత్యనారాయణ, నలుప రాజు సైదులు, ఉప్పుల గోపాలు, బొల్లు రవీందర్ కుమార్, దొండ కృష్ణారెడ్డి, కొత్త అంజయ్య, కండే యాదగిరి, బొల్లు వసంత కుమార్, సైదులు, గంగుల యాదయ్య, జంజిరాలశ్రీను, జగన్, కుందారపు సైదులు, కట్ట అంజయ్య, వెంకయ్య, రసూల్ పురం కార్యదర్శి సైదులు, రమేశ్ పాల్గొన్నారు.
Nalgonda Rural : అమరుల యాదిలో మోటార్ సైకిల్ యాత్ర