మోతె, మార్చి 15 : మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని బిక్యతండాలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండిపోయిన వారి పంటకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వ ద్వారా నీరు రాకపోవడంతో మండలంలోని అన్ని గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయినట్లు తెలిపారు. ఒక్క తడికి నీరు అందిస్తే పంటలు బయటపడేవి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలి
ఎకరాకు 30 వేల రూపాయలు అప్పుచేసి పండిస్తే పొలం ఎండిపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలిపారు. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటూ, మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ఎండిపోయిన వరి పంటకు ఎకరానికి 30 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుచూపు లేకుండా యాసంగి సీజన్ ప్రారంభంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు నేడు నష్టపోయినట్లు చెప్పారు. మోతే మండలంలో అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి ఉందని అన్నారు.
అధికారులు యుద్ధప్రాతిపదికన మోతే మండల వ్యాప్తంగా పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని గ్రామాల రైతులను పెద్ద ఎత్తున సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బానోతు లచ్చిన, చర్లపల్లి మల్లయ్య, జంపాల స్వరాజ్యం, గ్రామ శాఖ కార్యదర్శి భాను, వెంకన్న, రమేశ్, పాప హేమ్ల, సూర్య పాల్గొన్నారు.