రామగిరి, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకత, బడిలో విద్యార్థుల నమోదు తదితర అంశాలపై విద్యాశాఖ ఈ నెల 19వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. తొలి రోజు ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించారు.
పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, బడీడు పిల్లలను బడిలో చేర్పించుట, సర్కారు బడిలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలకు వివరించేలా ప్రణాళికలు చేశారు. అదే విధంగా ఆయా పాఠశాలల పరిధిలో బడిబాట ర్యాలీలు నిర్వహించారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో నిర్వహించిన బడిబాటలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమాల్లో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల చైర్మన్లు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.