పెద్దవూర, జనవరి 30 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మండలంలోని కోమటికుంట, బాసోనిబావి తండాల్లో ఎమ్మెల్సీ నిధులు రూ.10లక్షలతో చేపట్టిన సీసీ, బీటీ రోడ్డు పనులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన మార్పును కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించాలన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని, ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం రైతు బంధు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి పర్చారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చెన్ను అనూరాధ, తిరుమలగిరి (సాగర్) ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్, కేకే తండా సర్పంచ్ బాణావత్ శంకర్‌నాయక్, నాయకులు రమావత్ రవినాయక్, నడ్డి లింగయ్య పాల్గొన్నారు.