సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన దురాజ్‌పల్లి లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చారు. మంగళవారం బోనం ఎత్తుకుని మెట్ల మార్గం గుండా వచ్చి చౌడమ్మకు సమర్పించారు. లింగమంతుల స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. బోనం ఎత్తుకుని వచ్చే క్రమంలో దగ్గరికి వచ్చిన భక్తులను ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు లోకసభలో ఆమోదం పొందిన రోజున పెద్దగట్టు జాతరకు రావడం సంతోషంగా ఉందన్నారు.
భక్తులు ప్రశాంత వాతావరణంలో జాతర జరుపుకోవాలని, లింగన్న ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ హయాంలో రూ.14 కోట్ల వెచ్చించి కనీవినీ ఎరుగని రీతిన పెద్దగట్టును అభివృద్ధి చేయడాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే సూర్యాపేట జిల్లా అయ్యిందన్నారు. దాదాపు 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఏనాడూ సూర్యాపేటకు మెడికల్ కళాశాల కావాలన్న ఆలోచన చేయలేదని తెలిపారు. గతంలో తాము ఇక్కడ కళాశాల పెడుతామంటే పెట్టనీయకుండా చేశారని ఎన్ఆర్ఐలు కొందరు చెప్తుంటారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సూర్యాపేటకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ వచ్చిందని తెలిపారు.
ఇక్కడి ఎస్పీ ఆఫీసు చూస్తే ఉత్తర భారతదేశంలోని చిన్న చిన్న రాష్ర్టాల్లో సెక్రటేరియట్లు కూడా ఇలా ఉండవన్నారు. పేదింటి బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేసీఆర్ 1,200 వసతి గృహాలు, వెయ్యికిపైగా జూనియర్ కళాశాలలు, 27 మహిళా డిగ్రీ కళాశాలలు అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు తెచ్చి సూర్యాపేట జిల్లాలను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. నాడు సూర్యాపేట జిల్లాలో దాదాపు 2.95 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లను అందిస్తే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డను పండబెట్టి పంటలను ఎండబెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందు కు నీళ్లు తేవడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. మేడిగడ్డ ఇంజినీర్లు ప్రాజెక్టును వినియోగించుకోవచ్చని చెప్తున్నా కక్షపూరితంగా వాడడం లేదని తెలిపారు. రైతుల పంటను ఎండబెడుతున్న ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగులుతుందన్నారు. లింగమంతుల స్వామిని దర్శించుకున్న వారిలో జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర నాయకుడు దూదిమెట్ల బాలరాజు, జడ్పీ వైస్ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు తదితరులు ఉన్నారు.