జనాభా ప్రాతిపదికన నిధుల్లో తీవ్ర అన్యాయం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉత్సవ విగ్రహంలా మారారు..
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మాట్లాడరు?
రాజ్యాంగానికి సవరణలు చేసింది ఆ పార్టీలు కావా?
మీడియాతో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడున్నర సంవత్సరాలుగా దక్షిణాది రాష్ర్టాలపై తీవ్ర వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. జనాభాను నియంత్రిస్తూ, ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ, అక్షరాస్యతను పెంపొందిస్తూ దక్షిణాది రాష్ర్టాలు ముందుకు సాగుతుంటే.. జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తున్నదని అన్నారు. ఉత్తరాది రాష్ర్టాలపై ఉన్న ప్రేమను తెలంగాణ, ఏపీ, తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ర్టాలపై చూపడం లేదని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పాశం రాంరెడ్డితో కలిసి గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్నీ నేటికీ నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. వాటిపై మాట్లాడాల్సిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఇక్కడి బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడే అంశాలకు పెడార్థాలు ఆపాదిస్తూ గగ్గోలు పెట్టడమే రాష్ట్ర బీజేపీ నేతలు నేర్చుకున్నారన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై పునర్విభజన చట్టంలోని అంశాల అమలుతోపాటు నిధులు వచ్చేలా ఒత్తిడి తేవాలని హితవు పలికారు. ఇప్పటి వరకు రాజ్యాంగానికి 104 సార్లకు పైగా సవరణలు చేసిన చరిత్ర కాంగ్రెస్, బీజేపీలదేనని అన్నారు. దళితుల జీవితాల్లో మార్పు కోసం ప్రారంభించిన దళిత బంధును విపక్ష నేతలు జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌కు చేతనైతే రాష్ర్టానికి ఒక్క జాతీయ ప్రాజెక్టునైనా తెచ్చి చిత్తుశుద్ధి నిరూపించుకోవాలని, లేదంటే చేతకాదని ప్రకటిస్తూ పదవులకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలకు సైతం రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని, పార్లమెంట్లో కేంద్రంపై పోరాటంలో నోరుమెదపడం లేదని విమర్శించారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో విపక్షాలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని గుత్తా సుఖేందర్‌రెడ్డి హెచ్చరించారు.