నల్లగొండ : ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలు మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక అని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు ఇస్తున్న దసరా కానుక చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. బతుకమ్మ కానుక చారిత్రాత్మకం అని ఆయన అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ జాతికి మాత్రమే సొంతం అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే మహిళలకు సముచిత గౌరవం దక్కిందని అన్నారు. వారి అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మ, ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ రహత్ అలీ, రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేష్ గౌడ్, వాడిత్య దేవేందర్, పొన్నబోయిన భూదేవి సైదులు తదితరులు పాల్గొన్నారు.