మాడ్గులపల్లి, ఏప్రిల్ 7 : పేదల సంక్షేమం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. మండలంలోని కన్నెకల్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి.. దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెట్టి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఇంట్లో లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, దళితబంధు, మిషన్ భగీరథ వంటి వినూత్న పథకాలను ప్రవేశ పెట్టారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 35 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డి అన్ని శాఖల మంత్రి పదవులు అనుభవించినా నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్ పార్టీకి, క్యాడర్ లేని బీజేపీకి గ్రామాల్లో ఓట్లడిగే హక్కు లేదన్నారు. 2018లో నోముల నర్సింహయ్య గెలిచిన తరువాతే నియోజకవర్గంలో అభివృద్ధికి అడుగులు పడ్డాయని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో మండలంలోని పది గ్రామపంచాయతీల్లో రూ.7.5కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దేశాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని, సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి లేదని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాగ్రామానికి తీసుకెళ్లి పార్టీ విజయం కోసం కృషి చేయాలని శ్రేణులకు సూచించారు. సమావేశంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు మర్ల చంద్రారెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, పార్టీ మండలాధ్యక్షుడు బాబయ్య, నా యకులు హన్మంతరావు, రవి, మోసిన్‌అలీ, పగిళ్ల సైదులు, రాజు, పిచ్చిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.