గట్టుప్పల్/మునుగోడు, నవంబర్ 10 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు తనకు మరో మారు ఆశీర్వదించాలని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కోరారు. శుక్రవారం మునుగోడు మండలం కొరటికల్ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రామంలోని శివాలయం, హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడపూర్, కల్వలపల్లి, బీరెల్లి గూడెం, పులిపల్పుల, గంగోరిగూడెం, రత్తిపల్లి, ఊకొండి, సింగారం, కచలాపురం, పలివెల, ఇప్పర్తి, కిష్టాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి బోనాలు, డప్పుల దరువు, పటాకుల మోతతో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులిచ్చి దీవించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొరటికల్ గ్రామంలో బీటీ రోడ్ల నిర్మాణం, గూడపూర్‌లో 130 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. దాంతో పాటు అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి ప్రజల ఇబ్బందులు తీర్చినట్లు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు వంటి అనేక సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు.
ఎకడి నుంచో వచ్చి పార్టీలు మార్చి, ప్రజలకు మాయమాటలు చెప్పి, డబ్బులు వెదజల్లి గెలువాలని భావిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. తాను గెలిస్తే ఒక కొబ్బరికాయతో 100 పనులు చేపిస్తానని చెప్పి మళ్లీ కనిపించకుండా పోయాడన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మునుగోడు నియోజకవర్గానికి ఏ పనైనా చేసిండా అని ప్రశ్నించారు. 18 వందల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నిక తీసుకువస్తే మీరందరూ ఎలా బుద్ధి చెప్పారో.. ఇప్పుడు కూడా అలానే చెప్పాలన్నారు. డబ్బులకు అమ్ముడు పోయి స్వలాభం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. తాను రాజీనామా చేస్తేనే నియోజకవర్గానికి నిధులు వచ్చాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. అతడి వల్ల మునుగోడుకు పట్టిన దరిద్రం పోయింది.. అందుకే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది.. మళ్లీ శనిలా ఎందుకు దాపరిస్తున్నాడు.. అని మండిపడ్డారు.
రాజగోపాల్‌రెడ్డిని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని పేర్కొన్నారు. తాను గెలిస్తే నియోజకవర్గానికి ఏమి చేస్తాడో చెప్పడు కానీ.. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నాడని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డిని నమ్మి ప్రజలు మోసపోవద్దని, గోసపడొద్దని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అమలు చేయనుందన్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం, సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ. 3వేలు వంటి అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలౌతాయన్నారు. ఇల్లులేని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఇచ్చే బాధ్యత తనదే అని ధీమ ఇచ్చారు. ప్రజలంతా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని.. కారు గుర్తుకు ఓటు వేసి తనను మరో మారు ఆశీర్వదించాలని కోరారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, మూడో మారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు, సస్యశ్యామలం అవుతుందన్నారు.
మునుగోడు గడ్డపై పుట్టిన తనకు ఈ ప్రాంతంపై అమిత మైన ప్రేమ ఉందని, అందుకే నిత్యం ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధి చేస్తున్నానన్నారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరో మారు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, సర్పంచులు వల్లూరి పద్మా లింగయ్య, కంచి జ్యోతి, పానుగంటి పారిజాత నర్సింహ, గుర్రాల పరమేశ్, గజ్జల బాలరాజు, బొజ్జ సుజాతా శ్రీను, ఎంపీటీసీలు వంటెపాక వెంకటమ్మా వెంకటయ్య, బొల్గూరి లింగయ్య, పోలగోని విజయలక్ష్మీ సైదులు, పార్టీ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి, రాష్ట్ర నాయకులు శిర్గమల్ల కిశోర్‌కుమార్, ఉప సర్పంచులు ఎల్లంకి యాదగిరి, నాయకులు ఐతగోని శేఖర్, దెందే మల్లేశ్, దాసరి లింగస్వామి, దోటి కర్ణాకర్, గొపగోని బాలరాజు, శివర్ల వెంకన్న, బోయపల్లి రవి, లాలు గౌడ్, మందుల సత్యం, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఐతగోని విజయ్, అద్దంకి జగన్, సందీప్‌రెడ్డి, బొడ్డుపల్లి శంకర్, శ్రీశైలం, గణేశ్, సైదులు, ప్రణయ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.