సూర్యాపేట, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉండాలని, సమస్యలపై ప్రజాల పక్షాన పోరాడాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ సూర్యాపేట నియోజకవర్గస్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. మండలాల వారీగా నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌కు తొలి రోజు సూర్యాపేట టౌన్, రూరల్, ఆత్మకూర్.ఎస్ మండలాల ముఖ్య నేతలు హాజరు కాగా, గుంటకండ్ల వారికి దిశా నిర్ధేశం చేశారు.
మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కి, ఇదేంటని ప్రశ్నిస్తే అణిచివేతతో పాలించాలని చూస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు పాలన వదిలి స్కాముల్లో పోటీలు పడుతున్నారని ఆరోపించారు. పదేండ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ వచ్చారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని బంద్ పెట్టి జనం నోట్లో మట్టి గొడుతున్నదన్నారు. అరాచకాలు సృష్టిస్తాం.. ప్రశ్నిస్తే కేసులు పెడుతామని బెదిరిస్తున్న తీరుతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు.
పలు సమస్యలపై తెలంగాణ భవన్‌కు నిత్యం ప్రజలు బారులు తీరుతున్నారని, కాంగ్రెస్ అరాచకాలు తట్టుకోలేక మహిళలు సైతం బయటకు వచ్చి పోరాడుతామంటున్నారని తెలిపారు. ఆపద సమయంలో బీఆర్ఎస్ శ్రేణు లు ప్రజలకు అండగా నిలువాలన్నారు. మనం చేసిన అభివృద్ధి ఆగం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పుట్టిం దే తెలంగాణ అభివృద్ధి కోసమని, సంపద దోచుకుంటాం.. అభివృద్ధిని అటకెక్కిస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాడడం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త బాధ్యత అన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.