నల్లగొండ, డిసెంబర్ 8 : ‘దామరచర్లలో ప్రారంభం చేసిన యాదాద్రి పవర్ ప్లాంట్, నల్లగొండలో ప్రారంభించిన మెడికల్ కళాశాల బీఆర్ఎస్ సర్కార్ నిధులతో చేపట్టినవే. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే ఈ రెండు ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. ప్రారంభం చేసి మేమే చేశామని గొప్పలు చెప్పడం కాదు.. అసలు ఏడాది కాలంలో రేవంత్ ఈ జిల్లాకు ఇచ్చిన నిధులేమిటి? నల్లగొండకు వచ్చి ఒక్క శంకుస్థాపన కూడా చేయకుండా మా ప్రాజెక్టులు ప్రారంభం చేసి పోయాడే తప్ప ఒక్క రూపాయి ఇచ్చాడా?’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సీఎం రాక కోసం అయిన ఖర్చు అయినా నిధుల రూపంలో జిల్లాకు తేకపోవటంతో ప్రజలు నవ్వుకుంటున్నట్లు తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 7500మెగావాట్ల విద్యుత్ తెలంగాణలో ఉంటే 2027 నాటికి 24వేల మెగావాట్లు కావాలనే ఆలోచనతో దామరచర్లలో 4వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తే అందులో 800మెగావాట్లు అందుబాటులోకి వచ్చిందని, ఇది కేసీఆర్ ముందుచూపే తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పాలనతోనే తెలంగాణ ఆగమైందని, దాన్ని గాడిలో పెట్టడానికే కేసీఆర్ ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, దాన్ని తిరిగి ఈ ఏడాదిలోనే నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ ఇచ్చి రైతాంగాన్ని ఎంతో గొప్పగా ముందు వరుసలోకి తీసుకొస్తే రాష్ట్రంలో రుణమాఫీ పేరుతో రూ.30వేల కోట్లు ఎగ్గొట్టి రూ.12వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ చేసిందని, ప్రతి గ్రామంలో 30 నుంచి 35శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ అయిందని, త్వరలో ఆధారాలతో నిరూపిస్తానని చెప్పారు. జిల్లాలకు వస్తే కేసీఆర్ ఏదో ఒక వరం ఇస్తాడని ప్రజలు అంతా నమ్మేవారని, ఇవ్వాళ రేవంత్ ఎక్కడికి వచ్చినా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిత్యం బీఆర్ఎస్ వాళ్లను తిడుతూ మూడు తిట్లు.. ఆరు శాపనార్థాలతో వెళ్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 12వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి అందులో ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, దాన్ని కప్పి పుచ్చి కేసీఆర్ హయాంలో వేసిన నోటిఫికేషన్లు కూడా తమ ఖాతాలో వేసుకొని తామే 55వేల ఉద్యోగాలు ఇచ్చామంటే నిరుద్యోగులు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
మూసీ ప్రక్షాళనకు నడుం కట్టిందే మేము…
మూసీ వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని, మురికి నీరు తాగాల్సి వస్తుందని నాడు కేటీఆర్‌తో చర్చించి 2వేల ఎమ్ఎల్డీ సామర్థ్యంతో 32 ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేయడం మొదలు పెట్టింది బీఆర్ఎస్ హయాంలోనేని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. దుశ్చర్ల సత్య నారాయణ చేసిన పోరాటం కేటీఆర్‌కు వివరించి, నిధులు తీసుకొచ్చి శుద్ధి చేశామని, మూసీ ప్రక్షాళనను ప్రారంభించిందే తామని చెప్పారు. ఆ ప్రాజెక్టు తప్పనిసరిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలతో నల్లగొండను తడిపిందే బీఆర్ఎస్ సర్కారేనని, కాళేశ్వరంతో ఈ జిల్లాలో వేల ఎకరాలు సాగులోకి వచ్చిందని తెలిపారు. పదేండ్లల్లో రాష్ట్రంలో రెండున్న కోట్ల ఎకరాల్లో సాగు జరిగినందునే 3లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 40లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వచ్చినట్లు చెప్పారు.
చేసిన ప్రాజెక్టుకే మరోసారి ట్రయల్ రన్
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ట్రయల్ రన్ గత మే నెలలోనే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యే హోదాలో చేస్తే దాన్ని మళ్లీ సీఎంతో ట్రయల్ రన్ చేయించడం హాస్యాస్పదంగా ఉందని జగదీశ్‌రెడ్డి అన్నారు. తాము శంకుస్థాపన చేసిన పనులు తమ హయాంలోనే 90శాతం పూర్తి కాగా, వాటిని ఇప్పుడు మీరు ప్రారంభించి తమ ప్రాజెక్టులు అని చెప్పుకోవడం సిగ్గుగా ఉందని తెలిపారు. జిల్లాలో ఒక్క ప్రాజెక్టుకు అయినా ఈ ఏడాది కాలంలో ఒక్క శంకుస్థాపన చేశారా అని మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ను ప్రశ్నించారు. అప్పట్లో ట్రయల్ రన్ చేయగానే కేటీఆర్, హరీశ్‌రావులకు కోమటిరెడ్డి సైతం కృతజ్ఞతలు చెప్పిన విషయం మర్చిపోయినట్లు ఉందని అన్నారు. ట్రయల్ రన్ చేసిన దాన్ని చేయడం కాదు, ఆ ప్రాజెక్టు కింద ఇంకా సాగు పెంచడానికి అదనపు నిధులు తెస్తే రైతులు హర్షిస్తారు తప్ప, చేసిన దాన్నే చేస్తే ఎవరూ నమ్మరని సూచించారు. ఇక ఎస్ఎల్బీసీ ఆలస్యం కావడానికి ఎవరు కారకులో, ద్రోహి ఎవరో, ఆ ప్రాజెక్టును ఆగం చేసిన దొంగ ఎవరో త్వరలో బయట పెడుతానని తెలిపారు.
ఇద్దరి మంత్రుల మోసాలు బయటపెడుతా..
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క శంకుస్థాపన కూడా చేయకుండా సొంత లాభం కోసం ఇద్దరు మంత్రులు పని చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నిత్యం మోసాలతో పాలన చేస్తున్న ఇద్దరు మంత్రులు ఎవరి దగ్గర ఏం తీసుకున్నారో, వారిని ఎలా మోసం చేస్తున్నారో చిట్టా మొత్తం తన దగ్గర ఉందని, త్వరలోనే వారి మోసాలు బయట పెడుతామని మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ను దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేశారు. జిల్లాలో త్వరలో మీ బాధిత సంఘాలు ఏర్పాటు అవుతాయ ని, ఇక మీ మోసాలు బయటపడే సమ యం వచ్చిందన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఆనాడు అనేక మంది మేథావులు, కవులు, శిల్పులు, తెలంగాణ ఉద్యమకారులు తమ తల్లి ఎలా ఉండాలో అనేది నిర్ణయించి రూపొందించారని, ఇవ్వాళా రేవంత్ సర్కారు తయా రు చేసిన రూపం తెలంగాణ తల్లిది కాద ని, కాంగ్రెస్ తల్లిది అని అన్నారు. కాంగ్రె స్ తల్లిని తమ కాంగ్రెస్ కార్యాలయాల్లో పెట్టుకోవాలని, కానీ సచివాలయంలో పెడితే అంగీకరించేది లేదని చెప్పారు. ఈ సమావేశంలో నల్లగొండ మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, కూ సుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, నాయకులు మందడి సైదిరెడ్డి, కటికం సత్తయ్య గౌడ్, రేగట్టె మల్లిఖార్జున్ రెడ్డి, బోనగిరి దేవేందర్, కరీం పాష, మాలె శరణ్యారెడ్డి, ఐతగోని యాదయ్య, మారగోని గణేశ్, అభిమన్యు శ్రీనివాస్, రావుల శ్రీనివాస్ రెడ్డి, కొండూరు సత్యనారాయణ, లొడంగి గోవర్ధన్ పాల్గొన్నారు.