ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం
పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి
స్వామివారి కల్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తులు
నార్కట్పల్లి, ఫిబ్రవరి 8 : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరురోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరుమర్తికి ఆలయ చైర్మన్ మేకల అరుణారాజిరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మహేంద్రకుమార్, యజ్ఞకులు అల్లవరపు సుబ్రహ్మణ్యం దీక్షావధానం, ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదట ఆలయ మహా మండపంలో వేద పండితులు శివశ్రీ నీలకంఠ శివాచార్య యాత్వికులు గణపతి పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పుణ్యాహవాచనం, పంచజన్య, పూజాప్రోక్షణ, అఖండ స్థాపన, త్రిశూల పూజా సూర్య నమస్కార పూజలు చేశారు. అగ్ని ప్రతిష్ఠాపన సృష్టికర్త బ్రహ్మ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. బుధవారం తెల్లవారుజామున కల్యాణోత్సవానికి భక్తులు తరలివచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి ప్రభుత్వం తరఫున తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు సమర్పించారు.