ఆలేరురూరల్, అక్టోబర్13: పెండింగ్‌లో ఉన్న మదర్ డెయిరీ బిల్లుల కోసం పోరా టం ఉధృతం చేస్తామని మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సోమవారం ఆలేరులోని మిల్క్ చిల్లింగ్ సెంటర్లో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో బొల్ల కొండల్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అఖిల పక్ష నేతలు మాట్లాడుతూ… మదర్ డెయిరీలో అవినీతి పెరిగినందు వల్లే రైతులకు బిల్లులు చెల్లించడంలేదన్నారు.
పాడి రైతుల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. దీపావళి నాటికి పెండింగ్ బిల్లులు చెల్లించని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దీపావళి తర్వాత కూడా బిల్లులు చెల్లించని పక్షంలో ఎమ్మెల్యే, మదర్ డెయిరీ చైర్మన్, మంత్రుల ఇండ్లతో పాటు, కలెక్టరేట్, సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు.
రౌండ్‌టేబుల్ సమావేశం అనంతరం ఆలేరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం తలుపుకు వినతిపత్రం అంటించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ డైరెక్టర్ సందుల భాస్కర్‌గౌడ్, మాజీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, ఆలేరు, యాదగిరిగుట్ట పీఏసీఎస్ చైర్మన్లు మొగులగాని మల్లేశ్‌గౌడ్, ఇమ్మడి రాంరెడ్డి, అఖిలపక్ష నాయకులు మంగ నర్సింహులు, గంగుల శ్రీనివాస్, పుట్ట మల్లేశ్ గౌడ్, వస్పరి శంకరయ్య, రాచకొండ జనార్దన్, తునికి దశరథ, చెక్క వెంకటేశ్, కామిటికారి కృష్ణ, మామిడాల సోమయ్య, మామిడాల బాలమల్లేశ్, ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, చాడ సురేందర్‌రెడ్డి, పాల సంఘాల చైర్మన్లు, రైతులు పద్దఎత్తున పాల్గొన్నారు.