యాదగిరిగుట్ట, జూన్15: ఏసీపీ, ముగ్గురు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, స్పెషల్ టీం, ఎస్వోటీలు వెరసి 70 మంది పోలీసులు, నాలుగు పోలీసు వాహనాలు, రెండు డీసీఎంలతో ఆదివారం మల్లాపురం అట్టుడికింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పోలీసులు దీక్ష భగ్నం చేసేందుకు ముకుమ్మడిగా దాడి చేసి ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్న బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యతోపాటు మరో 30 మంది నాయకులను బలంతంగా వాహనాల్లో ఎక్కించారు. ముందస్తు ఎందుకు మాపై దాడికి పాల్పడుతున్నారని అడిగేందువచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారు.
అక్కడి దీక్ష పాల్గొన్న నేతలకు వార్నింగ్‌లు ఇవ్వడంతో యుద్ధ వాతావరణం నెలకొన్నది. అడ్డం వచ్చిన మహిళలను సైతం మహిళాపోలీసులతో అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రభుత్వ వైద్యకళాశాలను మల్లాపురంలోనే నెలకొల్పాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం సుమారు 500 మంది మహిళలు, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ పాల్గొని దీక్షకు మద్దతు పలికారు.
మహిళలంతా భోజనానికి వెళ్లి తిరుగువద్దామనుకుంటున్న సమయంలోనే అదును చూసి హూటాహూటిన ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో సీఐలు భాస్కర్, శంకర్‌గౌడ్, కొండల్రావు, ఎస్సై ఉదయ్‌తోపాటు సుమారుగా 70 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు మూకుమ్మడిగా దీక్ష శిబిరంపైకి దూసుకువచ్చారు. అక్కడ ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న కర్రె వెంకటయ్యతోపాటు, బీఆర్ఎస్కేవీ నాయకులు బరిగే నర్సింహులు, ఒగ్గు మల్లేశ్‌తోపాటు మాజీ ఉప సర్పంచ్ పల్లెపాటి మాధవులను బలవంతంగా లాక్కెళ్లి డీసీఎంలో ఎక్కించారు.
పోలీసులను నిలదీసిన మహిళలు
మా గ్రామానికి వైద్య కళాశాల కావాలని ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తుంటే ఎందుకు అరెస్టు చేస్తున్నారని పోలీసులను మహిళలు నిలదీశారు. మల్లాపురంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని చెబుతూ బీఆర్ఎస్ నాయకుడు కర్రె వెంకటయ్య చేపట్టిన నిరాహార దీక్షపై పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, రౌడీల్లా వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి ఘటనలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఫైర్ అయ్యారు. ఏసీపీ శ్రీనివాస్ నాయుడిని నిలదీశారు. పోలీసులను గ్రామానికి ఎవరు పంపారో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు ఓట్లు వేస్తే ఇలా చేస్తారా అని మండిపడ్డారు. మా గ్రామంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని దీక్ష చేస్తుంటే మీకేం పని అంటూ గ్రామస్తులందరినీ అరెస్టు చేసి తీసుకుపోండంటూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాయకులను అరెస్టు చేసి తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో వాళ్లను వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
బీర్ల అయిలయ్యపై గ్రామస్తులు ఫైర్
మల్లాపురంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై మహిళలు ఫైర్ అయ్యారు. అమ్మమ్మ గ్రామమైన మల్లాపురంలో అభివృద్ధి చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే అయిలయ్య పోలీసులతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నామన్నారు. ఇంతమంది పోలీసులను గ్రామానికి పంపి దీక్షను భగ్నం చేయాల్సిన అవసరమేమొచ్చిందని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో మల్లాపురంలో వైద్యకళాశాల వచ్చే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రామంలో ప్రతి ఆడపడుచు కర్రె వెంకటయ్యకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు.
పూర్తి బాధ్యత ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యదే..
గ్రామానికి మంజూరైన వైద్య కళాశాలను మల్లాపురంలోనే నెలకొల్పాలని కర్రె వెంకటయ్య చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసి ఆయనను అరెస్టు చేసి పోలీస్‌స్టేషకు తరలించారు. కర్రె వెంకటయ్యకు ఎలాంటి హాని జరిగినా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, సీఐ కొండల్రావు పూర్తి బాధ్యత వహించాలి. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో పనిచేసే గంధమల్ల రవి అనుమానాస్పద మృతిపై ప్రశ్నించిన బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు.
ఈ ఉదంతం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పోలీసులను పెట్టించి కర్రె వెంకటయ్యను అరెస్టు చేసిన్నట్లుగా ఉంది. ఆయనతోపాటు 30 మంది బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని మండల పోలీస్స్టేషన్లకు తిప్పుతూ నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో యాదగిరిగుట్ట రూరల్ సీఐగా పనిచేసిన కొండల్రావు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. గంధమల్ల రవి అనుమానాస్పద మృతిపై సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
– మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి
రాజాపేటలో రాస్తారోకో…
రాజాపేట, జూన్ 15: మల్లాపురంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం రాజాపేట మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన చేపడుతున్న వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. కార్యక్రమంలో నాయకులు సట్టు తిరుమలేశ్, గుంటి మధుసూదన్‌రెడ్డి, సంధిల భాసర్ గౌడ్, ఎర్ర గోకుల జశ్వంత్, కాకాల ఉపేందర్, జనార్దన్ రెడ్డి, గోపిరెడ్డి, ఉప్పలయ్య గౌడ్, భాసర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.