రామగిరి నల్లగొండ, జూన్ 13 : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం నల్లగొండ మిషన్ భగీరథ ఎస్ఈ నాగేశ్వర్రావుకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో పెంచాల్సిన వేతనాలు నేటికి కూడా పెంచకుండా కాంట్రాక్టర్లు కాలయాపన చేస్తున్నారన్నారు. రోజురోజుకు నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నా మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతినిత్యం ప్రజలకు తాగునీరు అందించే కార్మికులకు ప్రతి నెల వేతనాలు సక్రమంగా రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కనీస వేతనం చట్టాలు అమలు చేయకుండా మిషన్ భగీరథ కార్మికులను శ్రమ దోపిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల వేతనాలు వెంటనే పెంచి 2024 నుంచి ఏరియర్స్ తో సహా కలిపి చెల్లించాలన్నారు. ఏజెన్సీలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి వేతనాలు పెంచకపోతే పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కేఎస్ రెడ్డి, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎండీ జానీ, ఏ.సైదులు, టి.సత్యనారాయణ, ఎం.రామకృష్ణ, ఎస్.మహేశ్, పి.రాజు, వై.లింగయ్య పాల్గొన్నారు.