మిషన్ భగీరథ నీరు రావడంతో రోగాలకు చెక్ పడిందని, సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి కలిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం సూర్యాపేట మండలం ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ ప్రాంగణంలో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. వేలాది మంది జనం తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలతో కలిసి ప్లాంట్‌ను సందర్శించారు. భగీరథ నీటితో కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ సూర్యాపేటకు మూసీ మురికి నీటిని తాపించిన చరిత్ర కాంగ్రెస్ పాలకులదేనని, ఆ పార్టీ నాయకులు కాలి యాత్ర, మోకాలి యాత్ర అంటూ మరోమారు ప్రజలను మోసం చేయడానికి బయల్దేరారని దుయ్యబట్టారు. 2014కు ముందు తాగునీటి కోసం నల్లాల వద్ద కొట్లాటలు ఉండేవని, స్వరాష్ట్రంలో ఇంటికే స్వచ్ఛమైన జలాలు వస్తున్నాయని అన్నారు. ఫ్లోరోసిస్‌ను కాంగ్రెస్ పాలకులు పెంచితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ మటుమాయం చేశారని తెలిపారు. కాంగ్రెసోళ్లు నాడు ఏం చేశారో ప్రజలకు తెలుసని, విమర్శలు, దాడులకు పూనుకుంటే జనమే చెంప పగిలేలా సమాధానం చెప్తారని అన్నారు. పీఏ పల్లి మండలం కోదండాపురం ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద వేడుకల్లో ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
– సూర్యాపేట రూరల్, జూన్ 18
సీఎం కేసీఆర్ పాలనలోనే సురక్షిత మంచినీరు
సూర్యాపేట రూరల్, జూన్ 18 : ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చాకే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందుతున్నదని, మిషన్ భగీరథ నీటితో ప్రాణాంతక వ్యాధులను కట్టడి చేయవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన మంచినీటి పండుగలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనంతోపాటు ప్లాంటులో కలియదిరిగి నీటి శుద్ధి ఎలా జరుగుతుంది.. భగీరథ నీటి వల్ల ఒనగూరే లబ్ధి విషయాలను అధికారులతో కలిసి జనానికి వివరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ పయాఖానా నీటిని సూర్యాపేట ప్రజలకు తాపించిన ఘనత కాంగ్రెస్ పాలకులకు దక్కిందని ఎద్దేవా చేశారు. అటువంటి నేతలు కాలి యాత్ర, మోకాలి యాత్ర అంటూ మరోమారు ప్రజలను మోసం చేయడానికి బయల్దేరారన్నారు. 2014కు ముందు తాగునీటి కోసం కులాయిల వద్ద కొట్లాటలు, బిందెడు నీళ్ల కోసం తండ్లాటలు, గుక్కెడు నీటి కోసం ముష్టి ఘాతుకాలు, పోలీస్ కేసులు అయిన సందర్భాలను గుర్తు చేశారు.
అటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడి సురక్షితమైన నీటితో అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వామ్యం అయిన ప్రజలను మోసం చేయడానికే ఆ యాత్రలు అంటూ మండిపడ్డారు. జీవ నదులు పారుతున్నా సీమాంధ్ర నేతలకు భయపడి గొంతులు ఎండబెట్టిన నైజం నాటి కాంగ్రెస్ పాలకులదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.50 వేల కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలకులు పెంచి పోషించిన ఫ్లోరోసిస్ పాపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ నీటితో మటుమాయం చేశారని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో రూ.1,250 కోట్లతో ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తుండగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5,102.39 కోట్లతో 6,94,024 ఇండ్లకు తాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. అటువంటి అద్భుతాలను మరిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో ఏం చేసిందని విమర్శలకు పూనుకుంటున్నారన్నారు. అలా నోరు తెరిచిన గొంతుకలకు మూతి మీద కొట్టేలా సమాధానం ఉండాలని, పాయఖాన నీళ్లు తాపించిన వారిని పాతరేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కమిషనర్ రామానుజులరెడ్డి పాల్గొన్నారు.
నీళ్ల విషయంలో రారాజు సీఎం కేసీఆర్
అన్ని రంగాలతోపాటు తాగు, సాగునీటి రంగంలో ప్రగతి సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రారాజు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తాగునీటి కోసం ప్రజలు పడుతున్న అరిగోసను చూసి తట్టుకోలేక గల్లీ నుంచి ఢిల్లీ దాకా కలిసి వచ్చినవారితో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పోరాటం చేశాను. ఫ్లోరోసిస్ రక్కసితో కాళ్లు, చేతులు వంగిపోయిన వారిని నాటి ప్రధాని వాజ్‌పేయి టేబుల్‌పై పడుకోబెట్టి వివరించినా ఫలితం లేకపోయింది. ఏ రాజకీయ పార్టీ, పాలకులు చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ టైం బౌండెడ్గా సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో నేడు ఎటు చూసినా జల సవ్వడులు కనిపిస్తున్నాయి. జిల్లా సమగ్రాభివృద్ధికి, తాగునీటి కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నీటి గోసను కళ్లారా చూసి బాధపడి ఉద్యోగం వదిలి ఉద్యమ బాట పట్టిన తాను నేడు ఇదే జిల్లాలో నీటి గళగళలు చూస్తున్నానంటే ఇది సీఎం కేసీఆర్ ఘనత. ఆంధ్రాలో రిజర్వాయర్లు నిర్మించినా, నీటి కోసం మరేది చేసినా అన్ని పార్టీల మద్దతు ఉంటుంది. ఇక్కడ కాళేశ్వరం కట్టినా.. మిషన్ భగీరథ చేపట్టినా అడ్డు పుల్లలు వేసి కోర్టులకు వెళ్లే దుర్మార్గులు ఉండడం బాధాకరం. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలి.
– దుశ్చర్ల సత్యనారాయణ, జలసాధన ఉద్యమ నేత