మఠంపల్లి, జనవరి 21 : రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు నిధులు అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని కాల్వపల్లితండా, కొత్తదొనబండ తండాలో ఉపాధిహామీ నిధులు రూ.76లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ పాఠశాలలు, లాలితండాలో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే గ్రామ పంచాయతీలకు సీసీ, ప్రహరీ నిర్మాణాలకు రూ.15లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అమరవరం లిఫ్ట్ మరమ్మతులను 15రోజుల్లో చేయిస్తామని, హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ముడావత్ పార్వతి, తాసీల్ద్దార్ మంగా రాథోడ్, ఎంపీడీఓ జానకిరాములు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకట్‌రెడ్డి, డీఎస్పీ ప్రకాశ్‌యాదవ్, సర్పంచులు మాలోతు సుజాత, బాణోతు విజయ, బాణోతు బోడి, మంజూనాయక్, సాముల శివారెడ్డి, ఎల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పిండిప్రోలు రామచంద్రయ్య, సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాల్గొన్నారు.