నీలగిరి, జూన్ 22 : జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడమే తమ ధ్యేయమని, రానున్న మూడేండ్లలో శ్రీశైలం సొరంగంతోపాటు బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకం, ఇతర అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. జూలై 4వ తేదీతో పాలకవర్గం గడువు ముగుస్తుండటంతో చివరి సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు తమ మండలాల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ, వ్యవసాయం, విద్యుత్, విద్య తదితర అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చర్చించింది. జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా నల్లగొండ జిల్లా అభివృద్ధే ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ తాగు నీరు వచ్చేలా చూడాలని, అధికారులు గ్రామాల్లో తిరిగి సమస్యలను గుర్తించి పరిషరించాలని, అవసరమైతే శాసనసభ్యుల నిధుల ద్వారా చిన్న చిన్న సమస్యలను అధిగమించాలని సూచించారు. ఆగస్టు 15లోగా రాష్ట్రంలో సుమారు 31 వేల కోట్ల రూపాయలను రైతుల రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు వెల్లడించారు. రైతు భరోసాపై సైతం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, రూ.2 లక్షల రుణమాఫీ చేసింది గతంలో ఏ ప్రభుత్వం లేదని తెలిపారు.
జిల్లాలో లోఓల్టేజీ, ఇతర లూజ్ వైర్ల మరమ్మతులు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటి కోసం ఇదివరకే జిల్లాకు రూ.11 కోట్లు మంజూరు చేశామని, మరో రూ.7 కోట్లు విడుదల కానున్నాయని చెప్పారు. జిల్లాలో ఎకడైనా ట్రాన్స్ఫార్మర్లు, ఓవర్ లోడ్ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిషరిస్తామని తెలిపారు. అడిషనల్ బడ్జెట్‌ను ప్రతిపాదించాలని విద్యుత్ ఎస్ఈని ఆదేశించగా, విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సభ్యులతో కోరారు.
ఇదిలా ఉంటే విద్యుత్ శాఖ అధికారుల తీరుపై వాడివేడిగా చర్చ సాగింది. జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడలో ప్రతిరోజూ విద్యుత్‌కు అంతరాయం కలుగుతుందని అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడుతూ గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను పరిషరించాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమావేశానికి హాజరైన జడ్పీటీసీలు, ఎంపీపీలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శాలువా, మెమెంటోలతో సన్మానించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో పాలకమండలి సభ్యులు ఫొటోలు దిగి ప్రతి సభ్యుడిని సన్మానించారు. చివరి సమావేశం కావడంతో సభ్యులంతా గ్రూపు ఫొటో దిగారు. ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల మంత్రిగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నందున జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గొట్టిముకల, సింగరాజుపాలెం, పెండ్లిపాకుల రిజర్వాయర్లు, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి రిజర్వాయర్లు, కాల్వలను పూర్తిచేయడానికి చొరవ చూపాలి. ప్రజా సమస్యల పరిషారమే ధ్యేయంగా సమష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం. వరద నీటితో నిండే ప్రాజెక్టులు ప్రస్తుతం దాదాపు 98శాతం పూర్తయ్యాయని, వాటికి మరో రూ.40 కోట్లు కేటాయిస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. మిషన్ భగీరథకు సంబంధించిన బిల్లుల చెల్లింపులపై అధికారులు స్పష్టత నివ్వాలి. ఎస్డీసీ నిధులకు సంబంధించి కలెక్టర్ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి, వాటిని అప్రూవల్ చేయాలి.
‘గడిచిన 5 సంవత్సరాలు ఒడిదుడుకులు లేకుండా జిల్లా పరిషత్ కార్యక్రమాలను, సమావేశాలను సజావుగా నిర్వహించాం. ఎన్నో రకాల ప్రజాసమస్యలను జిల్లా పరిషత్ స మావేశంలో చర్చించి పరిష్కరించగలిగాం. అన్ని సమావేశా లు ఇబ్బందులు కలుగకుండా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’. వాతావరణ మార్పులతోనే కరెంట్ సమస్యలు : బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే ‘కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. వాతావరణంలో మార్పుల కారణంగా అక్కడక్కడ వైర్లు, ఇతర సమస్యల కారణంగా అధికారులే కరెంటును తొలగిస్తున్నారు. ప్రమాదాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా గాలి దుమారం, ఇతర సమస్యలు వచ్చినప్పుడు, చెట్లు తొలగించే సమయంలో కరెంటును నిలిపివేస్తున్నారు’.
‘శాలిగౌరారం మండలంలో పంచాయతీరాజ్ రోడ్లు కొన్ని చోట్ల కంకర తేలి ఉన్నాయి, వాటిని బాగు చేయాలి. జాతీయ రహదారి నుంచి ఇరుకులపాడు రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలి. శాలిగౌరారం చెరువు కట్టను పటిష్టం చేసే పనులు చేపట్టాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోవాలి’.
‘వర్షాలకు విద్యుత్ స్తంభాలు చాలా ప్రాంతాల్లో కూలిపోయాయి. లూజ్ వైర్లు తెగిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలా తండాల్లో కరెంటు తీగలు ఇండ్లపై నుంచి ఉన్నాయి, వాటిని తొలగించాలి. విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు ప్రతి నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు ఇప్పించే విధంగా మంత్రి చొరవ చూపాలి’.
‘వానకాలం పంటలకు సంబంధించి రైతులు ఇప్పటికే చాలా వరకు పంటలు వేసుకున్నారు. పెట్టుబడులకు వడ్డీ వ్యాపారస్తులను అశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతు భరోసా ద్వారా ఎకరాకు 15వేల రుపాయలు ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం వెంటనే వారి ఖాతాలో జమ చేయాలి. చాలా గ్రామాల్లో కరెంట్ సమస్య ఉత్పన్నమవుతున్నది. ప్రతిరోజూ ఐదారు గంటల కరెంటు పోతున్నది. ఫలితంగా ఆయకట్టు ప్రాంతంలో అక్కడక్కడ బోర్ల కింద సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి’.