యాదగిరిగుట్ట, మే2 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, అనుబంధ ఆలయమైన పాతగుట్టలో స్వామివారి జయంత్యుత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధానాలయం ముఖమండపంలో అర్చకులు స్వస్తీవాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, రక్షాబంధనం చేపట్టారు. స్వామివారు ఉదయం తిరువేంకటపతి అలంకార సేవలో, సాయంత్రం గరుడ వాహనంపై వాసుదేవుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అంకురారోపణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం కాళీయ మర్ధన అలంకార సేవ చేపట్టనున్నారు. స్వామివారు హనుమంత వాహనంపై
శ్రీరామావతారంలో సాక్షాత్కరించనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారి జయంత్యుత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. ఉదయం ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు. 9.30 గంటలకు ఆలయ ముఖ మండపంలో స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, కుంకుమార్చన, రక్షాబంధనం వంటి పూజా కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి లక్ష కుంకుమార్చన గావించారు. 11 గంటలకు తిరు వేంకటపతి అలంకార సేవలో స్వామివారు దర్శనమించారు. సాయంత్రం 6.00 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం వంటి కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం గరుడవాహనంపై పరమవాసుదేవ అలంకార సేవను ప్రధానాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. ఆయా పూజాకైంకర్యాలలో ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ ఎన్. గీత, ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనారసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, గజ్వేల్ రఘు, గజ్వేల్ రమేశ్‌బాబు, అర్చకబృందం తదితరులు పాల్గొన్నారు.
గరుడ వాహనంపై..
లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో జయంత్యుత్సవాల్లో భాగంగా సాయంత్రం 6.00 గంటలకు అంకురారోపణం, హవనం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పరమవాసుదేవుడిగా అలంకరించి గరుడ వాహనంపై ఊరేగించారు. కలియుగంలో మలిన జీవులు పరమపదం చేరుట కష్టతరం అయినందు వల్ల వాత్సల్య దయామయుడైన లక్ష్మీనృసింహస్వామి ఈ వేడుకలో భక్తకోటికి పరమపదనాథుడిగా దర్శనమిచ్చి అనుగ్రహించాడు.
ఆలయంలో నేడు..
నరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 9.30 గంటలకు నిత్య మూలమంత్ర హవనాలు, లక్షపుష్పార్చన కాళీయ మర్ధన అలంకార సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నృసింహ మూలమంత్ర హవనం, హనుమంత వాహనంపై శ్రీరామావతారం అలంకార సేవ చేపట్టనున్నారు.
పాపాలను తొలగించేందుకు..
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరు వేంకటపతి అలంకార సేవలో భక్తకోటిని భగవానుడు అగ్రహించారు. ఉదయం 11.00 గంటలకు మొదటిసారిగా స్వామివారి స్వయంభూ ప్రధానాలయ మాఢవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగించారు. కలిలోని పాపాలను తొలగించేందుకు వేంకటేశ్వర స్వామిగా ఏడుకొండులను ఆశ్రయించి భక్తకోటిని అనుగ్రహించిన తీరు ఈ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు.
సాంస్కృతిక కార్యక్రమాలు..
జయంత్యుత్సవాల్లో భాగంగా ప్రధానాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. మల్లాపురం గ్రామానికి చెందిన శ్రీరామ భక్తజన మండలి, గాయత్రి మహిళా భజన మండలి ఆధ్వర్యంలో భజనలు, భావనాలయ నృత్యాలయం, నటరాజ డ్యాన్స్ స్కూల్, శ్రావ్య బండారి, యాదాద్రి కూచిపూడి అకాడమి, సాంస్కృతిక విశ్వ కళామండలి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యాలు, ధరకోలాట బృందం కోలాటం కార్యక్రమాలు చేపట్టారు.
జయంత్యుత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాల్లో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆలోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం అంకురారోపణంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ ప్రధానార్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మాఢవీధుల్లో రథశాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.
నేటి నుంచి మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి తిరు కల్యాణోత్సవాలు
మఠంపల్లి మండలం మట్టపల్లిలో కృష్ణానది తీరాన గల స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం తిరు కల్యాణోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 8 వరకు జరిగే వేడుకలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3న సాయంత్రం ధ్వజారోహణం,అగ్నిపత్రిష్ఠాపన హోమం, 4న రాత్రి 12గంటలకు స్వామి వారి తిరుకల్యాణం, 5న ఉదయం స్వామి వారి గరుడవాహన సేవ, ఊరేగింపు, 6న కృష్ణానదిపై హంసవాహన సేవ, 7న వసంతసేవ, చక్రతీర్థ స్నానం, పూర్ణాహుతి, సాయంత్రం 6గంటలకు దోపు ఉత్సవం, 8న సాయంత్రం 6గంటలకు ద్వాదశ సేవలు, పవళింపు సేవ నిర్వహించనున్నారు.
పక్క రాష్ర్టాల నుంచి భక్తుల రాక
తిరుకల్యాణోత్సవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, చెన్పై తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. ఈ మేరకు భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్, క్యూలైన్లు, స్నానపు గదులు, మంచినీరు తదితర వసతి కల్పించినట్లు ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ సిరికొండ నవీన్ తెలిపారు.