రామగిరి, ఆగస్టు 14 : ప్రపంచ ఉపాధ్యాయ సంఘం నాయకురాలు, ప్రొఫెసర్ మెహఫూజా ఖానం (80) మృతి బాధాకరం అని డబ్ల్యూటీయూ, ఎఫ్ఐఎస్ఈ కార్యదర్శి ఎం.వీ. గోనారెడ్డి, నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు. ఈ మేరకు గురువారం వారు ఓ ప్రకటనను విడుదల చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ లోకానికి, నల్లగొండతో మెహఫూజా ఖానం అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. మెహఫూజా ఖానం ఈ నెల 12న ఢాకాలో ఆకస్మికంగా కన్నుమూశారు.
మెహఫూజా ఖానం 2008 నుండి 2016 వరకు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ యూనియన్స్ అధ్యక్షురాలిగా పనిచేసి, ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యమానికి విశేష సేవలు అందించినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమర యోధురాలిగా, ఆ దేశంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు, కాంట్రాక్ట్ కార్మికులు వంటి అనేక ప్రగతిశీల సంఘాలకు ఆమె నాయకత్వం వహించినట్లు వెల్లడించారు. ఢాకా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్‌గానూ ఆమె సేవలందించారన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన ఆమె, యునెస్కో, ఐఎల్ఓ వంటి అంతర్జాతీయ సమావేశాల్లో, ప్యారిస్, జెనీవా, బ్యాంకాక్, సియోల్, ఖాట్మండు, కొలంబో వంటి అనేక నగరాల్లో పాల్గొన్నారు. రిమోట్ ఏరియాల్లో జరిగిన సమావేశాలకు కూడా మిస్ కాకుండా హాజరయ్యారు. అహ్మదాబాద్, కోల్‌కతా, పాట్నా, ముంబై, నల్లగొండలో జరిగిన ప్రపంచ ఉపాధ్యాయ సమావేశాల్లో పాల్గొని ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినట్లు తెలిపారు. బొంబాయి యూనివర్సిటీ సెనేట్‌లో కూడా ప్రసంగించారన్నారు.
నల్లగొండతో ఆమెకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. 2013లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహించిన సదస్సులో పాల్గొని, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమైనట్లు తెలిపారు. అనేక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్న ఆమె, ఒక అద్భుతమైన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు మాత్రమే కాకుండా, పోరాట పటిమ కలిగిన మహానేత అని పేర్కొన్నారు.
Nalgonda : మెహఫూజా ఖానం మృతి బాధాకరం : ఎం.వీ. గోనారెడ్డి