నల్లగొండ : మొక్కల సంరక్షణ లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు. సోమవారం నకిరేకల్, శాలిగౌరారం మండలాల్లో ఎన్ హెచ్.365 రోడ్డు పక్కన నాటిన మల్టీ లేయర్ ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
నకిరేకల్ మండలం చందంపల్లి, నెల్లి బండ, కడపర్తి జి.పి.ల పరిధిలో, శాలిగౌరారం మండలం పెర్కకొండారం, మాధవరం, వంగమర్ధి జి.పి.ల పరిధిలో రహదారి వెంబడి గత సంవత్సరం అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటిన బహుళ వరుసలో మొక్కలను (multi layer plantation)ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మొక్కల సంరక్షణ చర్యలు పరిశీలించి సూచనలు చేశారు.
నెల్లిబండలో మొక్కలకు సక్రమంగా నీరు పోయక పోవడంతో మొక్కలు ఎండిపోవడం గమనించి పంచాయతీ కార్యదర్శి పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలకు సక్రమంగా ప్రతి రోజు నీరు పోయాలని, వేసవిలో మొక్కలు ఎండిపోకుండా చూడాలన్నారు. వారం రోజుల్లో మళ్లీ పర్యటిస్తానని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని పంచాయతీ కార్యదర్శి ని హెచ్చరించారు.
మొక్కలకు పాదులు తీసి ఎరువు పట్టించాలని, ప్రతి రోజు వాటరింగ్ చేయాలని, అప్పుడే మొక్కలు ఎదుగుదల ఉండి పెరుగుతాయని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్, నకిరేకల్ ఎం.పి.డి.ఓ. వెంకటేశ్వర్లు, ఎం.పి.ఓ.నాగ లక్ష్మి, శాలిగౌరారం ఎం.పి.డి.ఓ.లక్ష్మయ్య, ఎం.పి.ఓ.సుధాకర్, గ్రామ అధికారులు ఉన్నారు.