– రాఘవేంద్ర కాలనీ కమిటీ మితిమీరిన జోక్యంతో రాజీనామా
– రాజీనామా పత్రాలను ట్రస్టీ బోర్డు చైర్మన్కు అందజేత
నీలగిరి, సెప్టెంబర్ 03 : నల్లగొండ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలోని శ్రీ షీర్డి సాయి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయ కమిటీ సభ్యులు ముకుమ్మడిగా రాజీనామాలు చేశారు. శ్రీ రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ట్రస్టు అధ్యక్షుడికి తమ పత్రాలను అందజేసినట్లు అధ్యక్షుడు బోయినపల్లి రాంబాబు, కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాసులు, కోశాధికారి పోలీశెట్టి కృష్ణ తెలిపారు. గురువారం కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ఏర్పడి నిర్వహణ అస్తవ్యస్థంగా మారడంతో కాలనీ, దేవాలయానికి వేర్వేరుగా రెండు కమిటీలను ఏర్పాటు చేసి ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఒక కమిటీలో మరో కమిటీ జోక్యం లేకుండా ఉండాలని తీర్మాణం చేసి గత 14 నెలల కితం ఎన్నికల ద్వారా రెండు నూతన కమిటీలను పరోక్ష పద్దతిలో ఎంపిక చేయడం జరిగిందన్నారు.
నూతన కమిటీ ఏర్పాటు తర్వాత సంవత్సరం కాలంలోనే గుడిలోని విగ్రహాలకు రక్షణ గోడలు, ఐరన్ గ్రిల్స్, డోర్స్, గ్రానైట్ టైల్స్ లాంటివి నిర్మాణంతో పాటు గణేష్ మండపం నిర్మాణం పూర్తి చేస్తే కాలనీవాసుల, కమిటీ సభ్యుల మనోభావాలు దెబ్బతినేలా దాన్ని కూల్చివేశారన్నారు. దేవాలయంలో లైట్లు, ఆరు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు పండుగలు విజయవంతం నిర్వహించామన్నారు. దీన్ని ఓర్చుకోలేని కొంతమంది కాలనీ అసోసియేషన్ నాయకులు కానీ గత సంవత్సర కాలంగా ఇష్టనుసారంగా వ్యవహరిస్తూ దేవాలయ కమిటీలో కూడా జోక్యం చేసుకుని ఏలాంటి ఎన్నికల లేకుండా నిబందనలకు విరుద్ధంగా తమకు నచ్చిన వ్యక్తులను సభ్యులుగా ఉండాలని ఓత్తిడి చేసినట్లు తెలిపారు. దీన్ని వ్యతిరేకించినందుకు కాలనీ సభ్యులు దేవాలయ కమిటీని ఇబ్బందులు గురిచేయాలనే లక్ష్యంతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు.
కాలనీ అభివృద్ధి గురించి పట్టించుకోకుండా కేవలం దేవాలయం అభివృద్ధి అవుతుందనే అక్కసుతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. కాలనీలో వర్షం పడితే రోడ్లని చెరువులను తలపిస్తాయని వాటిని గురించి అలోచనలు చేయడం మానేశారన్నారు. అంతేగాకుండా కాలనీలో డ్రైనేజీ అస్తవ్యస్థంగా మారి మంచినీరు, డ్రైనేజీ నీరు కలుస్తున్న కూడా పట్టించుకోవడం లేదన్నారు. కాలనీ అభివృద్ధిని మరిచి దేవాలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకు దేవాలయ కమిటీ సభ్యులు మురుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుండి దేవాలయానికి మాకు ఏలాంటి సంబంధం లేదని కేవలం కాలనీ వాసులుగా మాత్రమే ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు వరకాంతం రాజేష్ రెడ్డి, సహాయ కార్యదర్శి ఏ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.