తిరుమలగిరి ఫిబ్రవరి 28 : జిల్లాలో మామిడి పూత కాస్త ఆలస్యమైనప్పటికీ సంతృప్తికరంగానే వస్తోంది. చాలా వరకు చెట్లు పూర్తిగా పూత, పిందె దశలో ఉన్నాయి. ఈ దశలో రైతులు చేపట్టే యాజమాన్య పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచనల మేరకు ఒక పద్ధతి ప్రకా రం సస్యరక్షణ చర్యలు చేపట్టి నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. మామిడి పూత రాక ముందు నెలలో తినే మంచు పురుగులు,చెట్ల మొదళ్లలో, కొమ్మల బెరళ్లలో దాగి ఉంటాయి. పూత సమయానికి ఇవి చెట్టు పైకి ఎగబాకి పూలగుత్తులను ఆశించి నష్టపరుస్తాయి. ఈ దశలోనే మంచు పురుగులను నివారించే చర్యలు తీసుకోవాలి.
మందుల పిచికారీలో జాగ్రత్తలు..
మామిడి చెట్లు పూర్తిగా ఎదిగిన దశలో ఉన్నప్పుడు చెట్టుకు అం దించే మందుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ దశలో మందుల పిచికారీ చేయకుండా ఉంటేనే మంచిది. ఈ దశలో మం దులు వాడడం వల్ల పిందెలు ఏర్పడటానికి సాయపడే కీటకాలు, తేనేటీగలు చనిపోతాయి. మందు ప్రభావంతో పూతలోని పుప్పొడి కొట్టుకుపోతుంది. పిందె దశలో చీడలతోపాటు హర్మోన్ల లోపాలు, నీటి ఎద్దడి, పొషక లోపాలు పంట దిగుబడిపై ప్రభావం చూపుతాయి.
చీడల నివారణ..
మామిడిలో పిందెలు ఏర్పడే దశలో మంచు పురుగు, తామర పురుగు, బూడిద తెగులు, మచ్చతెగులు, ఆశించి పిందెలు రాలిపోతాయి. ఈ సమస్య నివారణకు ఫిప్రోనిల్ (2 మి.లీ/లీ .) లేదా రోగర్ (2 మీ.లీ/లీ )ను హెక్పాకొనజోన్ (2 మి.లి /లీ )లేదా సాఫ్ (2 గ్రా/లీ)ను ప్లానోఫిక్స్ హోర్మోన్ను కలిపి 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మామిడి కాయలు నిమ్మ సైజులో ఉన్నప్పుడు పాస్ఫోమిడాన్ (లీటరు నీటికి 2.5 మి.లీ) లేదా మోనో ప్రోటోఫాస్ (లీటరు నీటికి 2 మి/లీ ) కలిపి పిచికారీ చేయాలి. మందులు పిచికారీ చేయటం వల్ల టెంక పురుగు, కాయ తొలుచు పురుగు, పండు ఈగల బెడదను నివారించవచ్చు . పండు ఈగల నివారణకు ఫిబ్రవరి-మార్చి నెలలో మిథైల్ యూజివాల్ ట్రాప్ను ఎకరానికి 4-6 చొప్పున అమర్చి వీటి బెడదను చాలా వరకు తగ్గించవచ్చు.

పిందె రాలకుండా నీటి తడులు..
మామిడి పిందె రాలిపోవటం పెద్ద సమస్య. ఈ సమస్యను నీటి తడులతో నివారించవచ్చు. నీటి ఎద్దడి, హర్మోన్ల, పోషక లోపాల వల్ల ఇలా జరుగుతుంది. పిందెలు ఏర్పాటయ్యే దశలో 15-20 రోజుల్లో నీటి అవకాశం ఉన్న చోట్ల 2-3 తడులను అందించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల పిందెలు రాలి పోవటం ఆగడమే కాకుండా కాయ పెద్ద సైజులో నాణ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాయకు మంచి ధర వస్తుంది.
నాణ్యమైన కాయల కోసం..
మామిడి పిందెలు ఏర్పడి పెరిగే దశలో చెట్ల సైజును బట్టి 500-1000 గ్రా.యూరియా , 500-1000 గ్రా. పొటాష్ ఎరువును 2 కిలోల వేపపిండితో కలిపి ప్రతి చెట్టుకు వేయటం వల్ల కాయ పెద్ద సైజు పెరిగి నాణ్యమైన దిగుబడి వస్తుంది.
ఒకే మందును ఒకేసారి పిచికారీ చేయాలి
చీడల నివారణ కోసం వీలైనంత వరకు ఒకసారి ఉపయోగించిన మందును మరోసారి ఉపయోగించకూడదు. ఎక్కువ సార్లు ఒకే రకమైన మందును ఉపయోగించటం వల్ల చీడ పురుగులు మందును తట్టుకునే శక్తిని సంపాదించుకునే అవకా శం ఉంది. అందు వల్ల పంటకు ఆశించిన తెగుళ్ల ఆధారంగా మాత్రమే మందులను పిచికారీ చేయాలి.
సింథటిక్ ఫైరిత్రాయిడ్లు వాడొద్దు
వీలైనంత వరకు మామిడిలో సింథటిక్ ఫైరిత్రాయిడ్ పురు గు మందులను వాడకపోవటమే మంచింది. మొదట్లో ఈ మందులు వాడినప్పుడు మంచి ఫలితాలు వచ్చినప్పటికీ దీర్ఘకాలంలో అనేక నష్టాలు ఉంటాయి. అంతేకాక తరచుగా వినియోగించడం వల్ల పురుగులు వీటిని తట్టుకునే శక్తిని సంపాదించుకుంటాయి. తక్కువ స్థాయిలో ఉండే పురుగులు సైతం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వీటిని విధిలేని పరిస్థితుల్లో మాత్రమే వాడాలి.
మందులు మోతాదులో వాడాలి
రైతులు ఉపయోగించే మందులకు ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సూచించిన మోతాదులో వాడడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మందులు ఉపయోగించేటప్పుడు వ్యాపారుల ప్రమేయం లేకుండా చూడాలి. వ్యాపారులు అవసరం లేని మందులను రైతులకు సూచించి ఆర్థికంగా నష్ట పరుస్తుంటారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలను అనుసరించి అధిక దిగుబడులు పొందాలి.
-నాగేశ్వరావు, మండల వ్యవసాయ అధికారి, తిరుమలగిరి