హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ప్రసిద్ధ మంజీరా డ్యామ్‌ను ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు, సంగారెడ్డి మండలంలోని కలబ్గూర్, నందికంది ప్రాచీన దేవాలయాలను ఆధ్యాత్మిక పర్యాటక ప్రాం తాలుగా అభివృద్ధి చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు. ఢిల్లీలో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. జాతీయ రహదారి-65 వెంట పెరుగుతున్న పరిశ్రమలు, వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని జహీరాబాద్-సంగారెడ్డి మార్గాన్ని ప్రస్తుత నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించాలని జహీరాబాద్, సంగారెడ్డి ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడరీకి విజ్ఞప్తిచేశారు. కోహిర్ మండలం దిగ్వాల్ వద్ద నిర్మించతలపెట్టిన అండర్‌పాస్/ఫ్లైఓవర్ వంతెనను 30 మీటర్లకు విస్తరించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు కోరారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి గడరీ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.