నేరేడుచర్ల, సెప్టెంబర్ 7 : వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల కష్టంగా మారింది. వరి సాగుకు సరిపడా నీళ్లు ప్రాజెక్టులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో మంచి ఫలితాలు సాధించవచ్చంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎర్ర నేలలు, నల్లరేగడి, ఇసుక, రాతి నేలలు అధికంగా ఉన్నాయి. అయితే.. రైతులు తమకు ఉన్న భూమిలో ఆరు తడి పంటల్లో ఏదో ఒకటి మొక్కుబడిగా కాకుండా నేలల రకాలను బట్టి పంటలను సాగు చేసుకోవడం వల్ల మంచి లాభాలను గడించవచ్చని గడ్డిపల్లి కేవీకే మృత్తికా శాస్త్రవేత్త అరిగెల కిరణ్ సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏ నేలల్లో ఏ రకం పంటలు సాగు చేయాలో వివరించారు. అదనపు సమాచారం కోసం 7893989055 నెంబర్ను సంప్రదించవచ్చు.
వేరుశనగ : గరప నేలలు, నీరు త్వరగా ఇంకే ఎర్ర చలక నేలల్లో వేరుశనగ సాగు చేసుకోవచ్చు. 100 నుంచి 120 రోజుల్లో పంట కోతకు వస్తుంది. దిగుబడి ఎకరానికి 8నుంచి 10 క్వింటాళ్లు. నూనె శాతం 48 – 50 శాతం ఉంటుంది.
విత్తే సమయం : సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ చివరి వరకు విత్తుకోవచ్చు.
రకాలు : కదిరి 6, 7, 8, 9, కదిరి హరితాంధ్ర, ఐసీజీవీ – 91114, ధరణి, కదిరి లేపాక్షి (కె-1812) రకాలు అనువైనవి.
ఆముదం : దీని పంటకాలం 120 నుంచి 140 రోజులు. ఎకరానికి దిగుబడి 6 -7 క్వింటాళ్లు వస్తుంది. నూనె శాతం 30-50 ఉంటుంది. అంతర పంటగా ఆముదం + కంది 1ః 1 నిష్పత్తిలో వేసుకోవచ్చు.
సమయం : యాసంగిలో అక్టోబర్ రెండో పక్షంలో విత్తుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు.
విత్తన మోతాదు : ఎకరానికి 2 – 2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.
ఆవాలు : మోస్తరు బరువైన నేలలు మంచి దిగుబడులను ఇస్తాయి. తేలికపాటి నేలలు, నల్లరేగడి, ఒండ్రు నేలల్లో కూడా పండించవచ్చు. ఎకరానికి 2 – 2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. పంట కాలం 120 – 125 రోజులు, దిగుబడి ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు వస్తుంది.
విత్తే సమయం : అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు.
రకాలు : పూసా అగ్రాని, వరుణ, పూసా మహల్, నరేంద్ర
అలసంద : నల్లరేగడి, ఎర్రనేలలు, నీరునిల్వని నేలలు అనుకూలం. పంటకాలం 110 రోజులు, ఎకరానికి 8- 10 కిలోల విత్తనం అవసరం, పశుగ్రాసంగా, పచ్చిరొట్టగా వేస్తే ఎకరాకు 12- 14 కిలోల విత్తనాలు అవసరం. ఎకరానికి 4 -5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
విత్తే సమయం : యాసంగి పంటగా సెప్టెంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. వేసవి పంటగా అయితే ఫిబ్రవరి వరకు వేసుకోవచ్చు.
రకాలు జీసీ- 3, వీ- 240, సీ- 152.
కంది : యాసంగిలో స్వల్పకాలిక రకాలు సాగు చేయవచ్చు. నల్లరేగడి, ఎర్రచెల్క నేలలు అనుకూలం. పంటకాలం 120 – 130 రోజులు. ఎకరానికి 7 – 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
సమయం : యాసంగి పంటగా సెప్టెంబర్ 15నుంచి అక్టోబర్ 15 వరకు వేసుకోవచ్చు.
రకాలు : ఎల్ఆర్జీ – 41, లక్ష్మీ ఐసీపీఎల్- 85063, మారుతీ ఐసీపీ- 8863 అనువైనవి.
పెసర, మినుము : తేమను పట్టివుంచే అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చు. మినుము సాగుకు అత్యంత బరువైన నల్లరేగడి నేలలు అనుకూలం. దిగుబడి ఎకరానికి 5 – 6 క్వింటాళ్లు వస్తుంది. పెసర 60 – 65 రోజుల్లో పంట కోతకు వస్తుంది. మినుము 70- 80 రోజుల్లో కోతకు వస్తుంది.
సమయం : వానకాలం వరి తర్వాత నవంబర్ 15 నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు.
పెసర రకాలు : డబ్ల్యూజీజీ – 37 (ఏకశిల), ఏజీజీ – 347, (మాదిర పెసర)
మినుము రకాలు ఎల్బీజీ – 752, ఎల్బీజీ – 20, ఎల్బీజీ – 26 పీయూ- 31
కుసుమ : యాసంగి పంటగా నాటుకోవచ్చు. నీరు నిల్వని బరువైన తేమ నిలుపుకొనే నల్లరేగడి, నీటి వసతి గల ఎర్ర గరప నేలలు అనుకూలం. పంటకాలం 125 – 130 రోజులు. ఎకరానికి 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 6 – 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
సమయం : అక్టోబర్ 15నుంచి నవంబర్ రెండో పక్షం వరకు విత్తుకోవచ్చు.
మొక్కజొన్న : నీరు ఇంకే నల్లరేగడి, ఎర్ర నేలలు, ఒండ్రు, ఇసుక నేలలు ఇనుకూలమైనవి. పంటకాలం 105 – 120 రోజులు. ఎకరానికి 8 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. దిగుబడి 18 – 20 క్వింటాళ్లు వస్తుంది.
సమయం : యాసంగిలో నవంబర్ మూడో వారం వరకు విత్తుకోవచ్చు.
రకాలు : డీహెచ్ఎం-1, డీహెచ్ఎం- 103, డీహెచ్ఎం- 107.
జొన్న : నల్లరేగడి, తేలికైన ఎర్ర నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. పంట కాలం 110 – 115 రోజులు, ఎకరానికి 3- 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. దిగుబడి ఎకరానికి 12- 14 క్వింటాళ్లు వస్తుంది.
విత్తే సమయం : సెప్టెంబర్ రెండో పక్షం నుంచి డిసెంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మాగీ జొన్న రకం ఎక్కువగా సాగవుతుంది.
రకాలు : సీఎస్హెచ్- 13, సీఎస్హెచ్- 16, సీఎస్హెచ్- 14, పీఎస్వీ-1.
చెరుకు : చౌడు భూముల్లో నాటుకునే వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. దిగుబడి ఎకరానికి 40 – 50 టన్నులు. చక్కెర శాతం 17- 18 శాతం. చెరుకు పంటకు నీటి సదుపాయం కలిగిన నల్లరేగడి, ఒండ్రు, మెరక భూములు అనువైనవి.
సాగు సమయం : డిసెంబర్ నుంచి మార్చి వరకు సాగు చేయవచ్చు.
రకాలు : కో- 6907, కో-8014, కో-94008, కో-419, కో-811, కో, ఆర్ – 8001
నువ్వులు : మురుగు నీరు నిలువని తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు గల నేలలు పనికిరావు. 85 – 90 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరానికి 2 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
అనువైన సమయం : జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు.
రకాలు : శ్వేత, రాజేశ్వరి, చందన, గౌరీ
పొద్దుతిరుగుడు : నీరు నిల్వ ఉండని ఎర్ర చెల్క, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు శ్రేష్టమైనవి. అంతర పంటగా 4 ః 2 నిష్పత్తిలో వేరుశనగ + పొద్దుతిరుగుడు, 1 ః 2లో కంది + పొద్దు తిరుగుడు సాగు చేయవచ్చు. నూనె శాతం 35 – 40 ఉంటుంది. 2.5 – 3 కిలోల విత్తనాలు ఎకరాకు అవసరమవుతాయి. పంట కాలం 90 – 95 రోజులు. ఎకరానికి 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
విత్తే సమయం : నవంబర్ మొదటి పక్షం నుంచి డిసెంబర్ చివరి వరకు, యాసంగిలో జనవరి రెండో పక్షం నుంచి ఫిబ్రవరి మూడో పక్షం వరకు విత్తనం వేయవచ్చు.
విత్తన రకాలు : కేబీఎస్హెచ్- 44, ఎన్డీఎస్హెచ్-1, డీఆర్ఎస్హెచ్-1
ప్రస్తుతం సాగర్ నీరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందున రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం మేలు. ఆరుతడి పంటల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా ఆరుతడిలో ఒకే పంటను కాకుండా మిశ్రమ రకాలు సాగు చేయడం ద్వారా రైతు నికర ఆదాయం పెరుగుతుంది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉంటాయి. పప్పు దినుసులు సాగు చేస్తే వాటి మొక్కల వేర్లు గాలిలోని నత్రజనిని స్థిరీకరించడంతో భూసారం పెరుగుతుంది. ఉపయోగకర సూక్ష్మజీవుల సంఖ్య సైతం పెరుగుతుంది. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులు ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు అధిక లాభాలు పొందవచ్చు.
– అరిగెల కిరణ్, మృత్తికా శాస్త్రవేత్త, కేవీకే గడ్డిపల్లి