నిడమనూరు, జూలై 14 : ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత మహిళను లైంగికంగా వేధించిన నేరానికి గాను దోషికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న తీర్పు వెలువరించారు. సోమవారం కోర్టు లైజన్ అధికారి షేక్ అలీ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండల పరిధిలోని గ్రామంలో 18 డిసెంబర్,2015న తన భర్త పనిపై ఊరికి వెళ్లడంతో మహిళ ఇంట్లో ఒంటరిగా నిద్రించింది. అర్థరాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి ఇంటి తలుపు కొట్టాడు. తన భర్త ఊరి నుండి వచ్చాడనుకుని మహిళ నిద్ర లేచి తలుపు తెరిచింది.
వెంటనే సదరు వ్యక్తి మహిళ చేతులు పట్టుకుని తన కొరికను తీర్చాల్సిందిగా ఒత్తిడి చేశాడు. భయంతో మహిళ కేకలు వేయగా చట్టుపక్కల వారు మేల్కొన్నారు. దీంతో వ్యక్తి అక్కడి నుండి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ నర్సింహారాజు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో దోషికి రెండేండ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల అదనంగా జైలు శిక్ష అనుభావించాల్సిందిగా తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.సాధన వాదనలు వినిపించారు.