తుంగతుర్తి, సెప్టెంబర్ 01 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే సమరభేరి ధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్న ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలనే పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్ రావు హాజరవుతున్నారన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై రేపు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, సర్పంచులు మేడదుల రమేశ్, మాతంగి వెంకటమ్మ కరుణాకర్, శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు గుడిపాటి వీరయ్య, గోపగాని రమేశ్, మల్లెపాక రాములు, విరోజీ నాయక్, పూర్ణ నాయక్ పాల్గొన్నారు.