నల్లగొండ, జూన్ 12 : తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రముఖ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, ప్రముఖ న్యాయవాది పృధ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణను ఈ శనివారం (14 -6- 2025) నాడు హైదరాబాద్, నాంపల్లిలోని శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్ పెండెం ధనుంజయ్ నేత తెలిపారు. గురువారం నల్లగొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పుస్తకాన్ని రచించడం కోసం నరహరి గారు భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలు, వివిధ బీసీ కులాలు, కుల వృత్తుల ప్రజల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో వారి సమస్యలు తెలుసుకుని ఈ పుస్తకంలో పొందుపరిచారన్నారు.
అదేవిధంగా బ్రిటిష్ పాలనలో కుల వృత్తులపై జరిగిన సామాజిక, ఆర్థిక దోపిడీ, కాకా కలేర్కర్ కమిషన్ నుండి మండల్ కమిషన్, న్యాయమూర్తి రోహిణి కమిషన్ వరకు జరిగిన పరిణామాలు, రిజర్వేషన్, క్రిమిలేయర్, రాజ్యాంగ న్యాయ విభాగాలపై ఉన్నత న్యాయస్థానాల తీర్పుల విశ్లేషణ వరకు అనేక అంశాలు ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు. ఎంబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మన సామాజిక చైతన్యానికి మద్దతు తెలుపుతూ భవిష్యత్ తరాలకు బీసీ ఉద్యమ చరిత్రను అందించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగం శ్రీకాంత్ యాదవ్, బీసీ నాయకులు గంజి రాజేందర్, పెద్దులు, దశరథ, విజయ్ కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.