పెన్‌పహాడ్, ఏప్రిల్ 15 : పెన్‌పహాడ్ మండలంలోని మాచారం రాయి చెరువును రిజర్వాయర్‌గా మార్చి, పరివాహక ప్రాంత గ్రామాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పెన్‌పహాడ్ మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ రైతు సంఘం మండల మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మండలంలోని రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. పెన్‌పహాడ్ మండలంలో ఐకేపీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు. సన్న వడ్లకు ప్రకటించిన బోనస్‌ను వెంటనే చెల్లించాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
పొలాలకు వెళ్లే బాటలు (రోడ్లు) నిర్మించాలని, పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి చివరి భూములకు నీరు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులకు ట్రాక్టర్ల సబ్సిడీని మంజూరు చేయాలన్నారు. మార్కెట్లో వస్తున్న నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ప్రభుత్వం పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్, జీఎంపీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వీరబోయిన రవి, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి గుంజ వెంకటేశ్వర్లు, సిఐటియు మండల కన్వీనర్ రణభంగ కృష్ణ, రైతు సంఘం మండల నాయకులు మోదుగు రవీందర్ రెడ్డి, మేకల నాగిరెడ్డి, మాతంగి వెంకన్న, రైతులు పాల్గొన్నారు.