యాదగిరిగుట్ట, ఏప్రిల్ 20 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి వెండి మొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చీపై వేంచేపు చేశారు. అనంతరం మాఢ వీధుల్లో ఊరేగించారు. జోడు సేవలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చన జరిపారు. బంగారు పుష్పాలతో దేవేరులను అర్చించారు. సాయంత్రం స్వామివారికి దర్బార్ సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు నిర్వహించారు. సుమారు 9 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.12,24,528 నిత్యాదాయం సమకూరినట్లు ఈఓ గీత తెలిపారు.
హుండీల ఆదాయం రూ.1,86,38,644
స్వామివారి 20 రోజుల హుండీల ఆదాయం కోటిన్నర దాటినట్లు ఆలయ ఈఓ గీత వెల్లడించారు. గురువారం కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీలను లెక్కించగా నగదు 1,86,38,644 వచ్చినట్లు తెలిపారు. 241 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 650 గ్రాముల మిశ్రమ వెండి, 595 అమెరికా డాలర్లు, 665 దిరామ్స్, 305 ఆస్ట్రేలియా డాలర్లు, 20 కెనడా డాలర్లు, 22 రియాల్స్, నేపాల్‌కు చెందిన 145 రూపాయలు, మలేషియాకు చెందిన రింగిట్, కువైట్‌కు చెందిన 14 దీనార్, బోట్సానాకు చెందిన 50 పౌలాలు, ఈజిప్టుకు చెందిన 5 పౌండ్లు, ఇంగ్లాండ్‌కు చెందిన 55 పౌండ్లు సమకూరినట్లు వివరించారు.